Begin typing your search above and press return to search.

పదేళ్లుగా పదవి లేకుండా పని చేశా: పవన్

By:  Tupaki Desk   |   28 March 2019 3:06 PM GMT
పదేళ్లుగా పదవి లేకుండా పని చేశా: పవన్
X
తను పది సంవత్సరాల నుంచి ఏ పదవీ లేకుండా ప్రజల కోసం పని చేసినట్టుగా చెప్పారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్! పదేళ్ల కిందట తొలి సారి ప్రత్యక్షరాజకీయాల వైపు వచ్చారు పవన్ కల్యాణ్. ఇలాంటి నేపథ్యంలో తను పదేళ్ల నుంచి ప్రజల కోసం పని చేసినట్టే అని పవన్ చెప్పుకున్నారు. ఈ కామెంట్ పట్ల భిన్నమైన స్పందనలు వ్యక్తం కావొచ్చు. తన ప్రజాసేవకు పదేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకోవడం పట్ల కొందరు ఆశ్చర్యపోవచ్చు.

పదేళ్ల కిందట పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన మాట వాస్తవమే కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయనతో పాటు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల ఫలితాల సంగతి అందరికీ తెలిసిందే.

ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యాకా.. పవన్ కల్యాణ్ ఏం చేశారు? అంటే.. సినిమాలు! 2009 ఎన్నికలు అయ్యాకా పవన్ కల్యాణ్ సినిమాలతో బిజీబిజీ అయ్యారు. వరసగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిల్లో కొన్ని హిట్ అయ్యాయి - మరి కొన్ని ఫట్ అయ్యాయి. ఏదయితేనేం.. పవన్ కల్యాణ్ అలా సినిమాలతో గడిపేశారు. మళ్లీ గత ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టుగా జనసేన పార్టీని పెట్టారు. ఎన్నికల ముందు మూడు నెలలు గట్టిగా పని చేశారు.

ఎన్నికలు అయ్యాకా మళ్లీ పవన్ కల్యాణ్ సినిమాలతోనే బిజీ అయ్యారు. అడపాదడపా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ ఐదేళ్లనూ తేసేద్దాం..అయితే అంతకు ముందు ఐదేళ్లలో కూడా తను ప్రజాసేవ చేసినట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకోవడం మాత్రం చిత్రంగానే ఉంది.

ఇలాంటి ప్రకటనలతో పవన్ కల్యాణ్ ప్రత్యర్థులకు కూడా అవకాశం ఇస్తున్నట్టే అవుతుంది. 2009 ఎన్నికలు అయ్యాకా పవన్ కల్యాణ్ ఏం చేశారో అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లలో కూడా తను పదవి లేకుండా ప్రజాసేవ చేసినట్టుగా పవన్ చెప్పుకురావడం మరిన్ని విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉంది!