Begin typing your search above and press return to search.

సీఎం నేనే అంటూ బంతిని బాబు కోర్టులో వేసిన పవన్...

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:30 PM GMT
సీఎం నేనే అంటూ బంతిని బాబు కోర్టులో వేసిన పవన్...
X
జనసేనాని రాజకీయంగా ఆరితేరిపోతున్నారు. ఆయనకు ఏమి తెలుసు రాజకీయం అనుకునేవాడిని సైతం షాక్ తినిపించేస్తున్నారు. వ్యూహాలు అంటే చంద్రబాబు జగన్ మోడీ మాత్రమే కాదని తానూ ఉన్నాను అనిపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాటుతేలిన రాజకీయాన్ని చూపిస్తున్నారు. పాము చావకుండా కర్ర విరగకుండా ఆయన చేస్తున్న రాజకీయం ప్రత్యర్ధులతో పాటు మిత్రులుగా ఉన్న వారికి మిత్రుత్వం కోరుకున్న వారికి కూడా అలెర్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

తాజాగా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి ఇలాకాలో టూర్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అక్కడ చేసిన హాట్ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన వైసీపీ తో రాజకీయ సయ్యాట ఆడారు. రాజకీయం ఏంటో చూపించారు. తాను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీని ఓడించి తీరుతాను అని భారీ శపధం చేశారు. దానికి తగిన ప్రాతిపదిక తన వద్ద ఉందని చాయన చెప్పడం ద్వారా అటు పార్టీ జనాలకే కాదు మిత్ర శత్రువులలోనూ ఆసక్తి పెంచేశారు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న ప్లాన్ ఏంటి అన్నది ఆలోచిస్తే ఆయన విశాఖలో మోడీతో భేటీ తరువాత తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. దానికే ఇపుడు ఇంకాస్తా పదును పెట్టి మరీ వదులుతున్నారు. మోడీ తో భేటీలో ఏం జరిగింది అన్నది బయటకు రాకపోయినా బీజేపీ జనసేన కలసి పోటీ చేయాలనంది మాత్రం ఫిక్స్ అయింది అని ప్రచారం సాగింది. అలాగే 2029 నాటికి ఏపీలో జనసేన బీజేపీ సర్కార్ ఏర్పాటు కావాలని, పవన్ కళ్యాణ్ సీఎం గా ఉండాలని బీజేపీ పెద్దలు ప్రతిపాదిస్తున్నారు.

తెలుగుదేశంతో వెళ్తే చంద్రబాబు సీఎం అవుతారు తప్ప మరోకరు కానే కారని ఆ విధంగా పవన్ కళ్యాణ్ జీవిత కాలం కోరిక తీరకుండా పోతుందని బీజేపీ పెద్దలు చెబుతున్నట్లుగా కూడా ప్రచారంలో ఉంది. నిజానికి చూస్తే అలాగే జరుగుతుంది, అక్కడ చంద్రబాబు నారా లోకేష్ తప్ప మరొకరు ఎవరూ కనిపించరు. దాంతో పవన్ కి కూడా మ్యాటర్ అర్ధమైంది. అలాగని బీజేపీతో 2024 పొత్తులకు వెళ్లి ఓట్ల చీలిక తెచ్చి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కి ఇష్టం లేదు.

అందుకే ఆయన మోడీ మాట జవదాటకుండా అదే టైంలో తాను సీఎం అయ్యే చాన్స్ ని 2029 దాకా పొడించుకోకుండా 2024 ఎన్నికల్లోనే తేల్చుకోవాలని చూస్తున్నారు అని తాజా టూర్ లో ఆయన చెప్పిన మాటలను బట్టి అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి సభలో మాట్లాడినది చూస్తే ప్రజలు కోరుకుంటే సీఎం ని అవుతాను అని అన్నారు. అంటే ఇక్కడ ప్రజలతో పాటు పార్టీ జనాలతో పాటు బాబుకు కూడా ఆయన సంకేతం పంపించారు అని అంటున్నారు.

తన వెనక మిత్ర పక్షం బీజేపీ ఉంది. భారీ ఓటు బ్యాంక్ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం ఉంది. తనతో పొత్తు కుదరాలీ అంటే సీఎం పదవిని తనకు ఇవ్వాలని ఆయన ఇండైరెక్ట్ గానే టీడీపీని చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. ఇక్క రాజకీయ అవసరం చంద్రబాబుది. 2024 ఎన్నికలలో ఒకవేళ జనసేన ఓడినా 2029 ఆప్షన్ ఎటూ ఉంటుంది. దాంతో అత్యంత కీలకమైన 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఆ పార్టీకి ఎంతో ఇబ్బంది అవుతుంది.

అందుకే తెలుగుదేశం రాజకీయ అవసరాలు పొత్తుల ఆరాటాలు అన్నీ అర్ధం చేసుకునే పవన్ కళ్యాణ్ ఈ రకంగా ప్రతిపాదించారు అని అంటున్నారు. ఒక వేళ ఈ ప్రతిపాదనకు టీడీపీ ఒప్పుకుంటే బీజేపీ కూడా టీడీపీతో పొత్తుకు కలవడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే పవన్ని సీఎం చేయడమే వారికి కావాలి. ఆ విధంగా బీజేపీ పెద్దల ఆలోచనలను కాదనకుండా తాము సీఎం అయ్యేలా పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా అన్నది చూడాలి.

కాదూ కూడదు అని బాబు ఒంటరి పోరుకు వెళ్తే 2019 నాటి పరిణామాలు రిపీట్ అవుతాయి. పొత్తులకు వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ కి అధికారంలో వాటా ఇవ్వాలి. ఆ విషయంలో టీడీపీ చంద్రబాబు మాత్రమే కాదు ఒక బలమైన సామాజికవర్గం కూడా ఒప్పుకోవాల్కి. మొత్తానికి చూస్తే నేనే సీఎం అంటూ బాబు కోర్టులోనే బంతిని వేసి తన వ్యూహమేంటో పవన్ చెప్పారు అని అంటున్నారు. దీని మీద టీడీపీ చేసే ఆలోచన బట్టే ఏపీలో పొత్తుల రాజకీయం ఒక కొలిక్కి వస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మార్క్ పాలిటిక్స్ టీడీపీకి ఇపుడు అతి పెద్ద పరీక్ష పెట్టేసింది అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.