Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోట మీద పవన్ కన్ను... ?

By:  Tupaki Desk   |   2 Oct 2021 10:34 AM GMT
టీడీపీ కంచుకోట మీద పవన్ కన్ను... ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ దూకుడు పెంచారు. ఆయన చాన్నాళ్ళుగా రాజకీయాల వైపు చూడడంలేదు, కేవలం ప్రెస్ నోట్లకు పరిమితం అవుతూ సినిమాలలో బిజీగా ఉన్నారని విమర్శలు వచ్చాయి. పవన్ కూడా కొంత సైలెంట్ అయ్యారు. అయితే అదంతా వ్యూహాత్మకమే అంటున్నారు. సరైన టైమ్ చూసి మళ్ళీ పవన్ జనాల్లోకి వచ్చారు. ఆయన ఇక మీదట మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడానికే సిద్ధపడ్డారని చెబుతున్నారు. మరో రెండున్నరేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దాంతో పవన్ తన పార్టీని పట్టాలెక్కించడంతో పాటు తాను కూడా జోరు చేయడానికే డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పవన్ ఓడిపోయారు. మరి ఏపీలో ఎటు చూసినా ఆయనకంటూ ఒక సీటు లేదు అన్నది తెలిసిందే. మరి ఈసారి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో కొన్ని సీట్లు పవన్ దృష్టిలో ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది.

తన అన్న 2009 ఎన్నికల్లో గెలిచిన తిరుపతి అసెంబ్లీ సీటు నుంచి పవన్ పోటీ చేస్తారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలను దాటిపోరని కూడా అంటున్నారు. ఈసారి పవన్ రెండు సీట్లలో పోటీ చేస్తారా లేక సింగిల్ సీటేనా అన్న దాని మీద కూడా జనసేనలో చర్చ ఉంది. ఆ సంగతి అలా ఉంచితే పవన్ కచ్చితంగా ఉత్తరాంధ్రా నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.

పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక ఎటూ ఉంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలుస్తారు అన్న నమ్మకం లేదుట. అదే సమయంలో వైసీపీలో వర్గ పోరు ఉంది. టీడీపీ నుంచి బలమైన నేతగా ఉన్న పల్లా శ్రీనివాసరావుని విశాఖ ఎంపీగా పోటీలో నిలిపేందుకు టీడీపీ చూస్తోంది అంటున్నారు. అందువల్ల టీడీపీతో పొత్తు కుదిరితే కచ్చితంగా పవన్ గాజువాకలో పోటీ చేస్తారు అంటున్నారు. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీ జనసేనలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఈసారి గాజువాక నుంచి పవన్ అసెంబ్లీలో అడుగుపెడతారు అంటున్నారు.

ఆ సీటు అలా ఉంచితే పవన్ చూపు మరో సీటు మీద కూడా ఉంది అంటున్నారు. అది టీడీపీకి కంచుకోట లాంటిది. కేవలం మూడు సార్లు తప్ప టీడీపీ ఆవిర్భావం నుంచి గెలిచే సీటు అది. విశాఖ జిల్లా సాగర తీరంలో ఉన్న భీమిలీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఆయన మరోమారు పోటీకి రెడీ అంటున్నారు. అయితే భీమిలీలో టీడీపీకి గట్టి పట్టుంది. ఈ మధ్య జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా మెజారిటీ వార్డులు టీడీపీ సొంతం అయ్యాయి. పంచాయతీలలోనూ బాగానే రాణించింది. ఇక ఇక్కడ జనసేన కూడా 2019 ఎన్నికల్లో పాతిక వేల దాకా ఓట్లు దక్కించుకుంది. అభ్యర్ధి కొత్త అయినా కూడా బలమైన సామాజిక వర్గం ఓట్లు జనసేనకు టర్న్ అయ్యాయి. అలాగే పవన్ చరిష్మా కూడా బాగా ఉపయోగపడింది. ఇక అవంతి గెలిచింది కూడా కేవలం పది వేల ఓట్ల తేడాతోనే. దాంతో ఈసారి పొత్తు ఉంటే కనుక పవన్ భీమిలీ నుంచి పోటీలో ఉంటారని అంటున్నారు. మొత్తానికి పవన్ భీమిలీ నుంచి పోటీ చేస్తే కనుక అది సంచలనమే అవుతుంది. భీమిలీ ఎపుడూ లోకల్ క్యాండిడేట్స్ నే చూసింది. మరి పవన్ వంటి సెలిబ్రిటీ పోటీ చేస్తే అక్కడ జనం ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాలి.