Begin typing your search above and press return to search.

ఏపీ మరో బీహార్ ని తలపిస్తుంది .. అంత అవసరమా అంటున్న పవన్ !

By:  Tupaki Desk   |   12 March 2020 1:59 PM GMT
ఏపీ మరో బీహార్ ని తలపిస్తుంది .. అంత అవసరమా అంటున్న పవన్ !
X
ఏపీ లో స్థానిక ఎన్నికల సమతంలో వైసీపీ చేస్తున్న దాడుల్ని తీవ్రంగా ఖండించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భయ పెట్టి సాధించిన గెలుపు ఎప్పటికీ నిలబడదని అన్నారు. స్థానిక ఎన్నిక విజన్‌ ను బీజేపీ, జనసేన పార్టీలు విడుదల చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. బెదిరింపులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేసారు. అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసే ఉద్దేశం ఉంటే.. ఆ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు అని, అసలు 151 మంది ఎమ్మెల్యే లు ఉన్న వైసీపీ ఎన్నికలంటే ఎందుకు భయపడుతుంది అని ప్రశ్నించారు.

ఏపీ అంటేనే హింస అనే పరిస్థితికి తీసుకొచ్చారు అని , ఏపీని మరో బీహార్‌ లా మార్చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామానికి అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. కానీ గతంలో టీడీపీ అసలు స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేదని.. ఇప్పుడు వైసీపీ ఎన్నికలను ఏకపక్షం చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడుతోందని మండిపడ్డారు. శేషన్ లాంటి ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఉండి ఉంటే ఇంత హింస ఉండేది కాదు అని, పోలీసులు, ఎన్నికల అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎక్కడ నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి నెలకొన్నదని, ఇది మంచి పద్దతి కాదు అని తెలిపారు. అలాగే ఇదే సమయం లో నామినేషన్లు వేసినవారెవరూ బెదిరిపోవద్దని.. ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. దెబ్బలు తిన్నా సరే బలంగా నిలబడాలని.. పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రతి జనసేన, బీజేపీ అభ్యర్థి.. ధైర్యంగా ఉండండి మీ వెనుక మేమున్నాం అంటూ దైర్యం చెప్పారు. ఇక, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని , అలాగే ఈ ఘటనలపై గవర్నర్‌ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి హింస జరగలేదు అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.