Begin typing your search above and press return to search.
పవన్ గారూ..బాబు - కేసీఆర్ మాత్రమే నేతలా?
By: Tupaki Desk | 27 Jan 2018 8:38 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్... తన మాటలు - చేతలతో మరింత కన్ఫూజన్ పెంచుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన పవన్... మొన్న తెలంగాణలో చేపట్టిన చలోరే చలోరే చల్ యాత్రను నేటి ఉదయం అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టించారు. ఏపీలోని రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లా అంటే పవన్‌కు మొదటి నుంచి ప్రత్యేకమనే చెప్పాలి. అనంతపురం జిల్లాకు హైదరాబాదు నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్... మార్గమధ్యంలో కనిపించిన రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా అసలు ఆయన కంటికే ఆననట్లుగా వ్యవహరించాన్న వాదన వినిపిస్తోంది. ఎవరేమనుకున్నా... తాను అనుకున్నది చేసుకుపోతానే తప్పించి, ఎవరినో సంతృప్తి పరిచేందుకు తాను యత్నించనన్న మాటను ముఖం మీదే చెప్పేసిన పవన్... నిజంగానే చాలా దూకుడుగానే వెళుతున్నారని చెప్పాలి.
అనంతలో అడుగుపెట్టిన మరుక్షణమే ప్రజా పక్షనే తన పక్షమంటూ ఘనంగా ప్రకటించిన పవన్... ఆ దిశగా ఏం చేస్తానన్న విషయాన్ని కూడా చెప్పేసి జనంలో మరింత కన్ఫూజన్ పెంచారనే చెప్పాలి. తాను ఎవరికీ తొత్తులా వ్యవహరించడంలేదని పవన్ స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని - అంశాలను బట్టి మద్దతు ఇస్తానని తెలిపారు. కరువు సమస్యలపై అధ్యయనం చేస్తానని. పరిష్కారాల కోసం కేసీఆర్ - చంద్రబాబులను కలుస్తానని తెలిపారు. తాను ఎవరికీ తొత్తునుకాను. రాజకీయాల్లో తనకు శత్రువులంటూ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అంశాలను బట్టి మద్దతు ఇస్తానని. రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని. సీమ సమస్యలపై ఓ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటానని. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను దూరమని. తన పని నచ్చితేనే ఓటువేయమని అడుగుతానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడున్న రాజకీయ నేతలకు మల్లే తాను మూస ధోరణిలో వెళ్లనని చెప్పిన పవన్.. తన దారి మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్ అని కూడా చెప్పేశారు.
ఇక్కడే పవన్ అభిమానులతో పాటు - పవన్ రాజకీయాల్లోకి వస్తే... తమకు ఎదో రీతిన మేలు జరుగుతుందని భావిస్తున్న వారు ఇప్పుడు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న వాదన వినిపిస్తోంది. నిత్యం అధికార పార్టీల పేర్లు చెబుతూ - ఆ పార్టీల అధినేత పేర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తున్న పవన్.. రేపు అధికారంలో ఉండే పార్టీలు మారితే... అప్పుడు కూడా ఇప్పుడు చెప్పే పేర్లు చెబుతారా? లేదంటే అప్పుడు అధికారంలో ఉండే పార్టీల పేర్లు చెబుతారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయినా తెలుగు నేలలో ఒక్క టీడీపీ - టీఆర్ ఎస్ లే రాజకీయ పార్టీలా? ఆ పార్టీల పేర్లే పవన్ నోట ఎందుకు వినిపిస్తున్నాయి? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంటే... తాను క్లారిటీగా ఉన్నానంటూ చెబుతున్న పవన్... తన మాటలతో జనాన్ని మాత్రం అయోమయంలోకి నెట్టేస్తున్నారన్న మాట.