Begin typing your search above and press return to search.

ఒట్టి మాటలే... చేతల్లేవ్

By:  Tupaki Desk   |   2 Feb 2016 3:30 PM GMT
ఒట్టి మాటలే... చేతల్లేవ్
X
వారిద్దరూ అన్నదమ్ములు... ఇద్దరూ వేర్వేరు పార్టీల నేతలు. చాలాకాలంగా పోలిటిక్స్ జోలికే రావడం లేదు. కానీ, ఏపీలో జరిగిన అనూహ్య ఘటనలతో ఇద్దరూ మళ్లీ బయటకొచ్చారు. ఒకరు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తే ఇంకొకరు తన ఉనికిని చాటుకోవడానికే అన్నట్లుగా వ్యవహరించారు. ఒకరు కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడితే ఇంకొకరు గొడ్డు గోతిలో పడింది కదా అని రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు ఇంకెవరో కాదు చిరంజీవి - పవన్. కాపు వివాదంపై స్పందించిన ఈ కాపు వర్గానికి చెందిన రాజకీయ నేతలు తమ మాటలతో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు. అటు కాపులకు కానీ, ఇటు ప్రభుత్వానికి మార్గదర్శనం చేయలేకపోయారు. సమస్యకు పరిష్కారం కూడా చూపలేకపోయారు. హింస లేకుండా దీనికి పరిష్కారం చూపే బాధ్యత తీసుకునేందుకు ముందుకు కూడా రాలేకపోయారు.

తునిలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవన్ - చిరంజీవిలు స్పందించారు. 'తమ్ముడు' పవన్ నేరుగా మీడియాతో ముచ్చటిస్తే, 'అన్నయ్య' బహిరంగలేఖ రూపంలో తెరపైకొచ్చారు. ఇప్పటివరకూ ఎక్కడా జనంలో కనిపించని పవన్‌ కల్యాణ్ తునిలో జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందించారు. అయితే, ఆయన ప్రసంగ ధోరణి యథావిధిగా గందర గోళంగానే కనిపించింది. మీడియాలో మాట్లాడిన ఆయన ఏ అంశంపైనా స్పష్టత ఇవ్వలేదు. తాను కాపు ఉద్యమాన్ని సమర్ధిస్తున్నానో, వ్యతిరేకిస్తున్నానో కూడా చెప్పలేకపోయారు. పైగా తాను కులవాదిని కాదని, జాతీయవాదినని చెప్పుకొచ్చారు. ఇంత చెప్పిన పవన్ తాను కాపులకు దన్నుగా ఉంటానని ఒక్కముక్క కూడా చెప్పలేకపోయారు. కమిషన్లపై కాపులకు నమ్మకం లేదని, కాపుల్లో ఏదో భయం ఉందని చెప్పిన పవన్.. బీసీలకు నష్టం లేకుండా కాపులను చేరిస్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్లవుతారని, ఇద్దరూ కలసి చర్చించుకుంటే బాగుంటుందని ఉచిత సలహా ఇచ్చారే తప్ప, తన దగ్గర ఉన్న పరిష్కార మార్గమేమిటో చెప్పటంలో విఫలమయ్యారు. కాపులను బీసీల్లో చేరిస్తే సహించేది లేదన్న బీసీల డిమాండ్‌ పైనా పవన్ స్పందించలేదు. అసలు ఆయన ఎవరిని విమర్శించారో, ఎవరిని ప్రశంసించారో కూడా ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ, తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా చెప్పకపోవడం అటు కాపులనూ అసంతృప్తికి గురిచేసింది.

మరోవైపు అన్నయ్య చిరంజీవి కూడా చాలాకాలం తర్వాత బహిరంగలేఖతో తెరపైకొచ్చారు. ఇంతవరకూ ఎప్పుడూ కాపుల గురించి మాట్లాడని చిరంజీవికి, తుని సంఘటన తర్వాత కాపులపై హటాత్తుగా ప్రేమ - సానుభూతి పుట్టింది. కాపులను బీసీల్లో చేరుస్తూ తక్షణం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిరంజీవి తన లేఖలో డిమాండ్ చేశారు. బీసీలకు ఇప్పుడున్న ప్రయోజనాలు పెంచాలే తప్ప, తగ్గించకూడదని సలహా ఇచ్చారు. బీసీలకు బాబు చేసింది కూడా ఏమీలేదని, 2009లో బీసీలకు వంద సీట్లు ఇస్తానని చెప్పి, మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాపులు సహా, అన్ని వర్గాలు రోడ్లెక్కి ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. కాపులకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, బీసీల్లో చేరుస్తానని చెప్పి 18 నెలలకు 2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 100 కోట్లు ఇచ్చిన కాలయాపన చేసిన ఫలితంగా కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే సందర్భంలోనూ, ఒక్కసారి కూడా కాపులను బీసీల్లో చేర్పించాలని కూడా డిమాండ్ చేయని చిరంజీవి ఇప్పుడు కాపుల గురించి మాట్లాడటం విశేషం.