Begin typing your search above and press return to search.

పింఛ‌న్ కు.. బీమాకు తేడా తెలుసా ప‌వ‌న్ ?

By:  Tupaki Desk   |   28 Feb 2019 6:58 AM GMT
పింఛ‌న్ కు.. బీమాకు తేడా తెలుసా ప‌వ‌న్ ?
X
క‌డుపు కాలిపోతుంద‌నుకోండి గుప్పెడు మెతుకులు పెడితే.. స‌ద‌రు వ్య‌క్తి చేసిన సాయాన్ని జీవితాంతం మ‌ర్చిపోలేం. అదే వ్య‌క్తికి గుప్పెడు మెతుకులు కాకుండా.. ఒక చిట్టి చేతిలో పెట్టి.. అయ్యా నువ్వు చ‌చ్చిపోతే.. నీ కుటుంబానికి పైస‌లు వ‌చ్చాయి.. నీకు బీమా చేయించాన‌ని చెబితే ఎలా ఉంటుంది? ఛ‌ండాలంగా ఉంటుంది క‌దా? కానీ.. ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అర్థం చేసుకున్న‌ట్లు లేదు.

రాజ‌కీయాల‌కు కొత్త కావ‌టం.. తన‌కు తాను ఎప్ప‌టిక‌ప్పుడు తానింకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంద‌ని చెప్పే ప‌వ‌న్‌.. త‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న ఇచ్చిన హామీ కూడా ఇదే తీరులో ఉంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల వేళ హామీల మీద హామీలు ఇచ్చే పార్టీల‌కు త‌గ్గ‌ట్లే.. త‌న పార్టీ కానీ అధికారంలోకి వ‌స్తే తామేం చేస్తామ‌న్న విష‌యంపై ఈ మ‌ధ్య‌న ప‌వ‌న్ హామీలు చెబుతున్నారు.

అయితే.. ఆయ‌న ఇచ్చే హామీలు అంత‌గా అక‌ర్షించ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఆయ‌న నోటి వెంట తాజాగా వ‌చ్చిన హామీ అవాక్కు అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. ప‌వ‌న్ సారుకు పెన్ష‌న్ కు.. బీమాకు మ‌ధ్య తేడా తెలీదా ఏంది? అన్న సందేహం రాక మాన‌దు.

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని క‌డ‌ప జిల్లాలో ప్ర‌చారం చేస్తున్న ప‌వ‌న్‌.. తాజాగా క‌డ‌ప‌లోని అన్న‌మ‌య్య స‌ర్కిల్ లో జ‌రిగిన స‌భ‌లో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ను చెబితే.. ఈ నాయ‌కులు 25 కేజీల బియ్యం.. రూ.3వేల పాకెట్ మ‌నీ ఇస్తే స‌రిపోతుంద‌ని అనుకుంటున్నారు. కానీ.. మా పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రికి సంవ‌త్స‌రానికి రూ.10ల‌క్ష‌ల చొప్పున ఐదేళ్ల‌కు రూ.50ల‌క్ష‌ల బీమా చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు.

అయ్యా ప‌వ‌న్ బాబు.. మేం బ‌త‌కటానికే కిందా మీదా ప‌డుతూ.. స‌ర్కారు ఇచ్చే వెయ్యి.. ప‌దిహేను వంద‌ల కోసం ఆశ‌గా ఎదురుచూస్తేంటే.. మీరేమో చ‌చ్చిన త‌ర్వాత ఇచ్చే బీమా సొమ్ము లెక్క చెప్ప‌టం ఏమిటి? ఏంది ఏడాదికి రూ.10లక్ష‌లు.. ఐదేళ్ల‌కు రూ.50 ల‌క్ష‌లా? వినేందుకు అంకెలు బాగానే ఉన్నాయి. కానీ.. అవ‌న్నీ చ‌చ్చిన త‌ర్వాత వ‌చ్చే పైస‌లే త‌ప్పించి.. బ‌తికి ఉన్న‌ప్పుడు రూపాయి పెట్టి మంచినీళ్ల పాకెట్ కొనుక్కోవ‌టానికి ప‌నికి రాదు. ఈ విష‌యం మీకు తెలీదా? పొర‌పాటున మాట్లాడారా? ఎందుకైనా స‌రే.. ఈసారి నుంచి హామీలు ఇచ్చే ముందు కాస్త వివ‌రాల మీద అధ్య‌య‌నం చేసి చెబితే బాగుంటుంది. విడి రోజుల్లో అయితే న‌వ్వి ఊరుకుంటారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఇలా మాట్లాడితే ప‌డే పాతిక ఓట్లు పోతాయి ప‌వ‌న్ సాబ్‌!