Begin typing your search above and press return to search.

హోదా విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచుతా: ప‌వ‌న్

By:  Tupaki Desk   |   14 March 2018 3:24 PM GMT
హోదా విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచుతా: ప‌వ‌న్
X
గుంటూరులో జ‌రిగిన జనసేన ఆవిర్భావ సభలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని - సెంటిమెంట్ లను గౌర‌వించి ఒక రాష్ట్రానికి హోదా ఇవ్వ‌లేమ‌ని ప్ర‌క‌టించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీపై ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. దేశ భాష‌లందు తెలుగు లెస్స అని, కానీ కేంద్రంలో ఉన్న ఉత్త‌రాదివారికి తెలుగు అర్థం కాదు కాబ‌ట్టి వారికి అర్థ‌మయ్యేలా ఇంగ్లిషులో మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్ అన్నారు. 2014లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇద్దాం అనుకున్నాం...కానీ, ఇపుడు కుద‌రదు....ఇవ్వ‌లేం అని కేంద్రం చెబితే చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. ఈ రోజు హోదా విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని స‌ర్దుకుపోతే....రేపు మ‌రో విష‌యంలో ఇలాగే చేస్తుంద‌ని అన్నారు. అందుకే , ఏపీ ప్ర‌జ‌లు ఏం చేయ‌గ‌ల‌రో కేంద్రానికి చూపించాల‌న్నారు. కేంద్రం అంటే ఏపీలో నేత‌ల‌కు భయమ‌ని - అందుకే ప్ర‌శ్నించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. మ‌న‌మంతా టంగుటూరి ప్రకాశం పంతులు వారసులమ‌ని - దోపిడీ చేసే వారే భ‌య‌ప‌డాల‌ని, మ‌నం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. తప్పుచేసిన వారికి సీబీఐ కేసులు పెడ‌తార‌ని, భ‌య‌మ‌ని.... కానీ, కేంద్రమంటే మాకేం భయంలేదు.నాలుగేళ్లుగా ఆంధ్ర‌ ప్రజలకు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పి జైట్లీ మ‌భ్య పెట్టార‌ని, కేంద్రం చేసిన అన్యాయం ఏపీ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను రగిలించి వేస్తోందన్నారు.

సెంటిమెంట్ తో ప్రత్యేక హోదా రాదన్న జైట్లీ అన్న మాట‌లు త‌మ‌ను వేధిస్తున్నాయ‌ని ప‌వ‌న్ అన్నారు. అటువంట‌పుడు, సెంటిమెంట్ ను గౌర‌వించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎలా మద్దతు పలికార‌ని జైట్లీని నిల‌దీశారు. అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ...ఏపీకి 5 ఏళ్ల‌పాటు ప్రత్యేక హోదా ఇస్తానని దేవాలయం లాంటి పార్లమెంట్ లో హామీ ఇచ్చింద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌జ‌లు ఉద్య‌మ‌బాట‌ప‌ట్టేలా కేంద్రం ప‌రిస్థితుల‌ను క‌ల్పించింద‌న్నారు. తాము ఢిల్లీలోని జంతర్‌ మంతర్ ద‌గ్గ‌ర పోరాటం చేయమ‌ని, ఏపీలోని జాతీయ రహదారులపై, అమ‌రావ‌తిలో ఉద్య‌మాలు చేస్తామ‌న్నారు. అమ‌రావతిలో పోరాటంపై దేశం దృష్టి సారించేలా చేస్తామ‌న్నారు. కేంద్రం చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఆ నాడు రాష్ట్రం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో చంద్రబాబు అనుభవం చూసే ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చాన‌ని, కేంద్రంలో కూడా మోదీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి న్యాయం చేస్తార‌ని ఆశించాన‌ని అన్నారు. కానీ, ఈ రోజున మోదీ...ఏపీకి తీర‌ని అన్యాయం చేశార‌ని, చంద్ర‌బాబు కూడా దానిని ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ఏపీలో అవినీతి- భూ క‌బ్జాలు పెరిగిపోయాయ‌ని, ఎన్నుకున్న నేత‌ల పిల్లలతో తొక్కించుకోవడానికా మ‌ద్ద‌తునిచ్చింది అని ప్ర‌శ్నించారు. ఏపీని మనమే బాధ్యతగా చూడకపోతే ఆ ఢిల్లీ వాళ్లు ఎలా చూస్తారని, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందనే సామెతను చంద్ర‌బాబు నిజం చేస్తున్నారన్నారు.