Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎజెండా:ముందు పాద‌యాత్ర‌..అనంత‌రం దీక్ష‌

By:  Tupaki Desk   |   4 April 2018 10:02 AM GMT
ప‌వ‌న్ ఎజెండా:ముందు పాద‌యాత్ర‌..అనంత‌రం దీక్ష‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా పోరులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మ‌రో కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. జనసేన కార్యాలయంలో సీపీఎం - సీపీఐ నేతలతో భేటీ అయిన ప‌వ‌న్ ప్రత్యేక హోదా - భవిష్యత్ కార్యాచరణపై చర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్రపై అవిశ్వాస నోటీసులిచ్చినా చర్చించ‌కపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందని ప‌వ‌న్ మండిప‌డ్డారు. ఈ నెల ఆరున జాతీయరహదారులపై పాదయాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు పవ‌న్ ప్ర‌క‌టించారు. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో పాదయాత్ర జ‌రుగుతుంద‌ని పవన్ వివ‌రించారు. అభివృద్ధి అంతా ఒకేదగ్గర కేంద్రీకృతం చేసే ప్రయత్నం జరుగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న రియాక్ట‌య్యారు.

లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా తాము భావిస్తున్నామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా సభను పదేపదే వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ సమస్య ప్రస్తుతం జాతీయ సమస్యగా మారి పార్లమెంటు ఒక సెషన్‌ మొత్తం ఏపీ సమస్యతో అట్టుడికిపోతోందని ప‌వ‌న్ అన్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం స్పందించ‌డం లేద‌ని తెలిపారు.పరస్పర విమర్శలతో తెలుగుదేశం - వైకాపాలు హస్తిన వేదికగా తెలుగువారి పరువు తీస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలు కోసం ఈ నెల 6వ తేదీన సీపీఐ - సీపీఎం - జనసేన పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని చెప్పారు. అలాగే అనంతపురం ఏప్రిల్‌ 15 - ఒంగోలు 24 - విజయనగరం మే 6న సదస్సులు నిర్వహిస్తున్నామని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. 6వ తేదీన‌ జరిగే పాదయాత్రలో విజయవాడలో తానూ పాల్గొంటాన‌ని ప‌వ‌న్ తెలిపారు. ఏ జిల్లా నేతలు ఆ జిల్లాలోనే పాల్గొంటారని ఆయ‌న వివ‌రించారు.

సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తే ప్రధాని మోడీ కనీసం పది నిముషాల సమయం కేటాయించి సభ్యులతో మాట్లాడలేదన్నారు. ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానం లేదని రామ‌కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ - వైకాపాల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే ఇక్కడ మాట్లాడుకోవాలని, పార్లమెంటులో వాదులాడుకోవడం సరికాదని ఆయన అన్నారు. కేంద్రం ఏపీ ప్రజలను చేతగాని వాళ్లలా చూస్తోందని సీపీఎం నేత‌ మధు అన్నారు.

కాగా, పాద‌యాత్ర అనంత‌రం ప‌వ‌న్ దీక్ష చేప‌ట్టున్న‌ట్లు తెలుస్తోంది. ఇటు హోదా పోరు, మరోవైపు ప్రజా సమస్యలు ఇలా రెండింటిపైనా ప‌వ‌న్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. నిత్యం జనం మధ్యలోనే ఉంటూ ఇక మరింత దూకుడు పెంచాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వ‌ర‌లో దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. తాజా భేటీలో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.