Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ 'దేవ' ర‌హ‌స్యం రివీల్‌!

By:  Tupaki Desk   |   3 May 2018 7:53 AM GMT
ప‌వ‌న్ దేవ ర‌హ‌స్యం రివీల్‌!
X
ప‌వ‌న్ ఏం చేసినా అదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీస్తుంది. రెండు రోజుల కింద‌ట జ‌న‌సేన పార్టీ అధినేత మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. తన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అంటూ దేవ్ అంటూ ప‌రిచ‌యం చేశారు. ఎలాంటి పేరు ప్ర‌ఖ్యాతులు లేక‌పోవ‌ట‌మే కాదు.. దేవ్ అని గూగుల్ సెర్చ్ కొడితే వ‌చ్చిన స‌మాధానాలు పొంత‌న లేకుండా ఉండ‌టం.. ఆయ‌న పేరు మీద గూగుల్ రిజ‌ల్ట్ లో వ‌చ్చిన ఇమేజ్ లు కూడా సంబంధం లేని రీతిలో ఉన్నాయి.

అయితే.. ఇదంతా రెండు రోజుల క్రితం. ఇప్పుడు ప‌వ‌న్ దేవ్ పేరుతో సెర్చ్ చేస్తే.. బోలెడ‌న్ని వీడియోలు.. క‌బుర్లు ఇప్పుడు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అంటూ గూగుల్ తో వెతికితే 74వేల‌కు పైగా రిజ‌ల్ట్ ఉన్న‌ట్లుగా చెబుతోంది.

తాజాగా దేవ్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు చూస్తే.. అత‌ని పూర్తి పేరు వాసుదేవ్ అని.. అలా అయితే గుర్తు ప‌డ‌తార‌న్న ఉద్దేశంతో దేవ్ గా కుదించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ దేవ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి అయితే.. కాంగ్రెస్ స‌ర్కారులో నేతృత్వంలోని ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా స‌తీమ‌ణికి సోద‌రుడు వ‌రుస అవుతార‌ని చెబుతున్నారు.

దేవ్ నివాసం హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ ప్రాంతానికి చెందిన‌ చింత‌ల‌బ‌స్తీలో ఆయ‌న ఇల్లు ఉంద‌ని తెలుస్తోంది. అన్నింటికి మించి.. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను చూస్తే.. బీజేపీలో ప‌ని చేశార‌ని.. ఆయ‌న తెలుగును అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌తార‌ని చెబుతున్నారు. మోడీ బిగ్రేడ్‌లో ఆయ‌న సేవ‌లు అందించార‌ని.. కిష‌న్ రెడ్డికి స‌న్నిహితుడిగా కూడా ప్ర‌చారం సాగుతోంది.

అన్నింటికి మించి..ఆయ‌న‌కు చెన్నైలో ఒక కంపెనీ ఉంద‌ని.. అందులో 350 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. రాజ‌కీయ స‌ర్వేలు.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీల బ‌లాబ‌లాల్ని విశ్లేషించ‌టం.. పార్టీల‌కు సేవ‌ల్ని స‌ద‌రు కంపెనీ అందిస్తుంద‌ని చెబుతున్నారు.

అధ్యాత్మిక భావాలు దేవ్ లో ఎక్కువ‌ని.. బీజేపీకి సుదీర్ఘ‌కాలం పాటు ప‌ని చేసిన అనుభ‌వం దేవ్‌కు ఉంద‌ని.. ఆయ‌న‌లోని అభిరుచులు.. అభిప్రాయాల‌కు ప‌వ‌న్ ప్ర‌భావితం అయ్యార‌ని.. ఈ కార‌ణంతోనే త‌న‌ను త‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా ప్ర‌క‌టించి ఉంటార‌ని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప‌వ‌న్ బీజేపీ ట‌చ్ లోకి వెళ్లార‌ని.. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న‌కు అవ‌స‌ర‌మైన రాజ‌కీయ స‌ల‌హాలు.. వ్యూహాల కోసం త‌మ‌కు చెందిన వ్య‌క్తిని పంపిన‌ట్లుగా ప‌లువురు చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత‌న్న‌ది కాలమే తేల్చాలి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి