Begin typing your search above and press return to search.
పవన్.. ఈ సామాజిక వర్గ నియామకాలేంది?
By: Tupaki Desk | 19 May 2018 4:15 AM GMTఠాట్.. నాకు కులం లేదు. మీరు నమ్మరేంది? నాకు కులం మీద పట్టింపుల్లేవు. ఆ మాటకు వస్తే మతం మీద కూడా. నాది కుల.. మతాలకు అతీతమైన ఆలోచనలు. కుల పరిమితుల్లోకి నన్ను ఇరికించమాకండి. కులం పేరుతో కుట్ర పన్నొద్దన్నట్లుగా ఉంటాయి జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలన్ని.
కులం మీద పవన్ అదే పనిగా చెప్పే మాటలకు.. చేతలకు మధ్య తేడా కొడుతోందన్న మాటను పలువురు ప్రస్తావిస్తున్నారు. పవన్ చుట్టూ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంతదాకా ఎందుకు..? ఆయనకు సలహాలు ఇచ్చే వారి దగ్గర నుంచి.. ఈ మధ్యనే తన రాజకీయ వ్యూహకర్త అంటూ పరిచయం చేసిన వ్యక్తి నుంచి ఆయన చుట్టూ సలహాదారులుగా వ్యవహరించేవారు.. ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చేందుకు నియమించుకున్న వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.
దీనికి బలం చేకూరేలా తాజా నియామకం ఉందని చెప్పక తప్పదు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అధికారికంగా ప్రకటనను కూడా విడుదల చేశారు. తోట చంద్రశేఖర్ తో పవన్ కు గడిచిన పదేళ్లుగా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని పవన్ వెల్లడించారు.
పరిపాలనాధక్షుడిగా.. పారిశ్రామికవేత్తగా విజయం సాధించినట్లుగా చెప్పే తోట చంద్రశేఖర్ సామాజిక వర్గం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన పేరులోనే అది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. పౌరపాలనలో తోటకు మంచి పట్టు ఉందని కీర్తించిన జనసేన అధికారిక ప్రకటన విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇటీవల కాలంలో పార్టీ నియామకాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవన్న విమర్శ ఒకటి అదే పనిగా వినిపిస్తోంది.
దీనిపై పవన్ తక్షణమే స్పందించి.. వివరణ ఇవ్వటం మంచిది అంటున్నారు. లేనిపక్షంలో దీన్నో విమర్శగా తెర మీదకు తీసుకొచ్చి ప్రచారం చేస్తే.. డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ వ్యూహకర్తలు.. సలహాదారులు ఇలాంటి అంశాల మీద కాసింత ఫోకస్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.