Begin typing your search above and press return to search.

పోలీసుల అతి.. ప‌వ‌న్ ఇంత చెబుతున్నా.. !!

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:13 PM GMT
పోలీసుల అతి.. ప‌వ‌న్ ఇంత చెబుతున్నా.. !!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో పోలీసులు అతిగా ప్ర‌వర్తించారా? ఆయ‌న‌ను అప్ర‌క‌టిత హోట‌ల్ నిర్బంధం చేశారా? క‌నీసం పార్టీ నాయ‌కుల‌ను క‌లుసుకునేందుకు.. వారితో స‌మావేశాలు పెట్టుకునేందుకు కూడా నిషేధం విధించారా? అంటే ఔన‌నే అంటున్నారు జ‌న‌సేన‌ నాయ‌కులు. తాజాగా ప‌వ‌న్ విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్‌కు నోటీసులిచ్చారు. పోలీసుల ఆంక్షలతో రెండు రోజులు హోటల్లోనే ఉండిపోయిన ఆయన.. హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్నారు. నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. విశాఖలో బయల్దేరే ముందు అరెస్ట్ అయ్యి విడుదలైన పలువురితో పవన్ చర్చించారు.

జనసేన కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్ట‌డం, అక్రమంగా అరెస్టు చేయ‌డంపై ప‌వ‌న్ ఒకింత ఆగ్రహంతోనే ఉన్నారు. అంతేకాదు,, తాను న‌గ‌రంలో ఉన్నప్పుడే ఇలా జ‌రిగితే.. భ‌విష్య‌త్తులో ఎలా ఉంటుందో.. అని ఆయ‌న మ‌థ‌న ప‌డుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. కేసులపై న్యాయ పోరాటానికి నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించడంపై ప‌వ‌న్ సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు పేర్కొన్నారు. త‌మ‌ పోరాటం ప్రభుత్వం పైనే కానీ పోలీసులపై కాదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆంక్షలు విధించకుండా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

మ‌రోవైపు పవన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నట్లు సమాచారం. విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేసే వీలుంది. ఇప్పటికే జనసేన నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజయవాడ రాక నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. విమానాశ్రయంలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతిచ్చారు.

అంతకుముందు విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌ వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటల్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని ద్వారాల వద్ద మోహరించారు.

హోటల్‌ వద్ద ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పవన్‌ బస చేసిన అంతస్తు, హోటల్‌ కాంపౌండ్‌లో పార్టీ నేతలెవరూ లేకుండా తరిమేస్తున్నారు. పవన్‌ను ఎవరు కలవాలన్నా ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు.

పవన్‌ తన గదిలో పార్టీ నేతలతో సైతం ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు పోలీసులు ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో పోలీసులు అతి చేస్తున్నార‌నే టాక్ జ‌న‌సేన వ‌ర్గాల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.