Begin typing your search above and press return to search.

బాబు సూపర్ హిట్...మరి పవన్...?

By:  Tupaki Desk   |   9 Jan 2023 7:07 AM GMT
బాబు సూపర్ హిట్...మరి పవన్...?
X
రాజకీయ గండర గండడు చంద్రబాబు. ఆయన వ్యూహాలు ఎపుడూ కరెక్ట్ గా ఉంటాయి. అంతే కాదు ఆయనకే రాజకీయ లాభాలు తెచ్చిపెడతాయి. చంద్రబాబు ఒకసారి పవన్ని కలిశారు. అది విజయవాడలోని ఒక హొటల్ లో. అప్పట్లో అది చర్చగా సాగింది. సీన్ కట్ చేస్తే ఇపుడు బాబు ఇంటికి స్వయంగా పని గట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీని వల్ల జనసేనానికే రాజకీయంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

అది ఎలా అంటే ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు అని ప్రచారం లో ఉంది. అందువల్ల జనసేనతో కలసి వెళ్లాలని చూస్తోంది. ఇది ఓపెన్ సీక్రెట్. రాజకీయాలు ఏ మాత్రం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయం. అంటే ఇక్కడ పవన్ తన మానాన తాను ఉంటే చాలు తెలుగుదేశమే దగ్గరకు వస్తుంది.

అపుడు బెట్టు చేసి మరీ కోరిన సీట్లతో పాటు అధికారంలో షేరింగ్ కూడా అడిగే చాన్స్ ఉంటుంది. దీన్నే రాజకీయ వ్యూహం అంటారు. రాజకీయాల్లో కోరికలు ఉన్నా చేయాలనుకున్నా దానికి టైం టైమింగ్ చాలా ముఖ్యం. ఏపీలో జగన్ని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా పొత్తులు అవసరం అని జనసేనకు కూడా తెలుసు. కానీ పవన్ రాజకీయ అనుభవ రాహిత్యం మూలంగానే ఆయన తన చేతిలో ఉన్న మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నిజానికి గత ఏడాది పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన ఒక స్టేట్మెంట్ పెద్ద తప్పు అని అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక లేకుండా చూస్తాను అని పవన్ నాడు బోల్డ్ గా చెప్పారు. అసలు ఆ బాధ్యత ఎవరు తీసుకోమన్నారు. అది ఆయనకు అవసరమా. రాజకీయాలలో ఎవరి అవకాశాలు వారు చూసుకుంటారు. తమ లాభాలను బట్టే పొత్తులు పెట్టుకుంటారు. పొత్తుల వల్ల తాము పై చేయి సాధించాలని చూస్తారు.

కానీ పవన్ మాత్రం జగన్ సీఎం కాకూడదు అని ఒక గిరి గీసుకున్నారు తప్ప జనసేన ఎదగాలని ఎత్తిగిల్లాలని కాపుల చిరకాల కోరిక మేరకు తాను సీఎం అవాలని ఆలోచించడంలేదు అంటున్నారు. సరే ఆ తరువాత అయినా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారా అంటే లేదు. చంద్రబాబు తానుగా విజయవాడ హొటల్ కి వచ్చారు అంటే పొత్తుల మీద తెలుగుదేశం పాకులాడుతోందని సిగ్నల్స్ వెళ్లాయి.

అయితే దాని తరువాత బెట్టుగా జనసేన ఉంటే పొత్తుల విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ పవన్ పై చేయి సాధించి ఉండేవారు. ఆయన హైదరాబాద్ లో చంద్రబాబును కలవడానికి వెళ్ళడం ద్వారా రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పు చేశారు అని అంటున్నారు. దీని వల్ల తెలుగుదేశం తో పొత్తుల కోసం జనసేన తహతహ లాడుతోందన్న సంకేతాలు ఇచ్చినట్లు అయింది అంటున్నారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ రేపటి రోజుల సీట్ల బేరాల విషయంలో సైతం తాను అనుకున్న స్థాయిలో బేరాలు సాగించలేరు అని అంటున్నారు. మరో వైపు వరసబెట్టి చంద్రబాబుని కలవడం ద్వారా జనసేన తన జెండా అజెండా విషయంలోనూ తాను నమ్ముకున్న వారికి తనను నమ్మిన బలమైన సామాజికవర్గానికి కూడా అయోమయాన్ని సృష్టించింది అని అంటున్నారు.

మొత్తానికి రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీతో చంద్రబాబు వ్యూహాలు రాజకీయంగా సూపర్ హిట్ అయ్యాయని, పవన్ కి భారీ నష్టమే వాటిల్లిందని అంటున్నారు. మరి ఇక మీదట పవన్ అడుగులు ఎలా ఉన్నా కూడా ఏపీలో డైరెక్ట్ ఫైట్ తెలుగుదేశం వైసీపీ అన్నది తేల్చేసిన భేటీగానే దీన్ని అంతా చూస్తున్నారు.