Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ తేనీటి విందుకు జ‌న‌సేనాని!

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:25 PM GMT
గ‌వ‌ర్న‌ర్ తేనీటి విందుకు జ‌న‌సేనాని!
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీపై క్లారిటీతో ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. స్వాతంత్ర్య‌ దినోత్సవం సందర్భంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్ భవన్‌లో తేనీటి విందు ఇవ్వ‌డం సంప్రదాయం. ఈ సంప్ర‌దాయంలో భాగంగా స‌హ‌జంగా ప్ర‌ముఖ రాజ‌కీయ‌ పార్టీల నేత‌ల‌ను గవర్నర్ ఆహ్వానిస్తారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌కు ఆహ్వానం ద‌క్కింది. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన ప‌వ‌ర్ స్టార్‌కు ప్ర‌త్యేక ట్రీట్ ద‌క్కింద‌ని అనుకోవ‌చ్చు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప్ర‌త్యేక చ‌ర్చ జ‌రిపారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిర్వ‌హించిన ఎట్ హోం కార్య‌క్ర‌మం సంద‌డిగా సాగింది. గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావులు హాజరయ్యారు. అనంత‌రం ఇరు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్‌ నరసింహన్ ఏకంతంగా సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశ‌మైన గ‌వ‌ర్న‌ర్ ఆ త‌దుప‌రి...జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ప్ర‌త్యేకంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం రాజ్‌భ‌వన్‌లోనే మీడియాతో చిట్‌చాట్‌లో పవన్‌ పాల్గొన్నారు. రాబోయే కాలంలో పుల్‌టైం రాజకీయాల్లో ఉంటానని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శంకర్‌ అనే వ్యక్తిని తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమించామని జనసేన అధినేత వివ‌రించారు.

కాగా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేకంగా ఈ విందుకు రావాల్సిందిగా ఆహ్వానం ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం అనుకుంటే...అందులోనూ ఇద్ద‌రు సీఎంల‌తో ప్ర‌త్యేక మంత‌నాలు సాగించిన గ‌వ‌ర్న‌ర్ అదే స‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స్పెష‌ల్ మీటింగ్ నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా తెలంగాణ‌లో పోటీ చేయ‌డం గురించి ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు బీజం వేసింది. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రాబోయే ఎన్నిక‌ల్లో కేవ‌లం 2 శాతం లోపు ఓట్లుమాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తెలంగాణ‌లో కూడా ప‌వ‌న్‌కు పెద్ద సంఖ్య‌లోనే అభిమానులు ఉన్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, నిర్మాత బండ్ల గ‌ణేశ్‌తో ప‌వ‌న్‌కు స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే.