Begin typing your search above and press return to search.

పవన్ ఏం చేస్తారు.? అందరికీ ఇదే ఉత్కంఠ..

By:  Tupaki Desk   |   11 March 2019 9:44 AM GMT
పవన్ ఏం చేస్తారు.? అందరికీ ఇదే ఉత్కంఠ..
X
దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ వేడి రగులుకుంది. దానికి తగ్గట్టే ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థుల ఖరారు.. జంపింగ్ , లాబీయింగ్ లతో బిజీగా ఉన్నాయి. కానీ ముచ్చటగా మూడో పార్టీ అయిన జనసేన పరిస్థితే ఇప్పుడు అయోమయంగా మారింది. పోయిన 2014లో బలం లేదని టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్.. తనకున్న బలంతో ఆ పార్టీల గెలుపుకు దోహదపడ్డారు.

ఇప్పుడు 5 ఏళ్లు గడిచిపోయాయి. బీజేపీ మోసం చేసిందని.. టీడీపీ హామీలు విస్మరించిందని దూరం జరిగిన జనసేనాని పవన్ ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. కేవలం వామపక్షాలతోనే కలిసి పోటీచేస్తామంటున్నారు.

ఇప్పుడు ఎన్నికల టైం ముంచుకొచ్చింది. జనసేన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్లు వేయడానికి ఇంకో వారం మాత్రమే టైం ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇప్పుడు ఆ పార్టీకి తూరుపు ముక్క.. ఇప్పటివరకు సంస్థాగత క్షేత్రస్థాయి బలం జనసేనకు లేదు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల కొరత వేధిస్తోంది.. ఏపీలోని 175 స్థానాలకు జనసేన తరుఫున నిలబెట్టడానికి నాయకులు కూడా లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. పోనీ 30 నుంచి 40 సీట్లలో పోటీచేద్దామని భావించినా ఇంకా పవన్ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టలేదు.

ఇంత తక్కువ టైంలో జనసేనాని పవన్ 175మందిని ప్రకటించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికార టీడీపీలో ఇప్పటికే నేతలు ఓవర్ లోడ్ అయ్యి ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీకి నియోజకవర్గానికి ఒకరిద్దరు చొప్పున ఉన్నారు.ఇక తొలిసారి జనసేన బరిలోకి దిగుతోంది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అంటే సామాన్యమైన విషయం కాదు.. పార్టీ బలబలాలు సమీక్షించడం.. సామాజిక సమీకరణాలు విశ్లేషించడం.. అంశాల వారీగా నియోజకవర్గాలను సమీక్షించి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు లోక్ సభ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇవ్వాలి.. దీంతో ఇంత పెద్ద పనిని పవన్ ఏ విధంగా పూర్తి చేస్తాడు.? అసలు సాధ్యమేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

అయితే ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల్లో టికెట్ దక్కని సీనియర్ నేతల టార్గెట్ జనసేనగా కనిపిస్తోంది. వారందరూ జనసేనలోకి వచ్చే చాన్సున్నా పవన్ తీసుకుంటాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. వారు వస్తే బలంతోపాటు బలగం పెరుగుతుంది. జనసేన విజయావకాశాలు పెరుగుతాయి. మరి పవన్ ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది వేచిచూడాల్సిందే.