Begin typing your search above and press return to search.

నేతలకు పవన్ కళ్యాన్ బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   12 Jan 2019 4:40 AM GMT
నేతలకు పవన్ కళ్యాన్ బంపర్ ఆఫర్
X
పదహేరేళ్ల వయస్సులోనే రౌడీలను తన్ని తరిమేశానని.. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగొట్టి కూర్చోబెడతారని.. తాను ఆకు రౌడీలకు , గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను వేధిస్తున్నాడని జన సైనికులు తాజాగా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు ఆయన సీరియస్ గా స్పందించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా మాట్లాడిన పవన్.. వేధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుపెట్టాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వం దళితులను వేధిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజల కోసం ఎవరితోనైనా పెట్టుకుంటానని.. చింతమనేని లాంటివాళ్లను వెనకేసుకొస్తున్న టీడీపీకి అండగా ఎందుకుండాలని ప్రశ్నించారు.

టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు జనసేన వైపు చూస్తున్నారని.. వారందరికీ స్వాగతం పలుకుతున్నామని జనసేనాని పవన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సమయం ఆసన్నమైనందున పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించామని పవన్ చెప్పారు. దీని కోసమే జిల్లా సమీక్ష చేస్తున్నామన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకుంటామన్నారు.

మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానని.. కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకొని తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విభజించు, పాలించు సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. బాబు, జగన్ రాజకీయ ప్రసంగాలతో విసిగిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత తాను పార్టీ స్థాపించి ఇంత దూరం నడిపించడమే చాలా కష్టమైన పని అని పవన్ అన్నారు. నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదని.. అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేన స్థాపించానని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

డబ్బు లేదని పార్టీ నడపలేరని ఎద్దేవా చేస్తున్నారని.. కానీ డబ్బు కన్నా పార్టీ నడిపేందుకు గుండె దైర్యం కావాలని పవన్ స్పష్టం చేశారు. తాను బలంగా ఉన్నానని.. తనతోపాటు బలంగా పోరాడే వారికోసమే చూస్తున్నానని చెప్పారు. బాబుకు, లోకేష్ కు పుట్టగానే అనుభవం రాలేదని స్పష్టం చేశారు. టీ ఎక్కువగా తాగుతానని.. ఆ టీ గ్లానే మన పార్టీ గుర్తయిందని.. మన ఆలోచన బలంగా ఉంటే అదే కలిసివస్తుందని తెలిపారు.

జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా విమర్శలు చేస్తానని.. టీడీపీ నేతలను తాను వ్యక్తిగతం ఎప్పుడూ విమర్శించలేదని పవన్ స్పష్టం చేశారు. నేతలకు బాధ్యతలపై త్వరలోనే నిర్ణయిస్తానని తెలిపారు.