Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ బ‌స్సు యాత్ర వాయిదా అందుకేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2022 5:30 AM GMT
ప‌వ‌న్ బ‌స్సు యాత్ర వాయిదా అందుకేనా?
X
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఎట్టి ప‌రిస్థితుల్లో చీల‌నివ్వ‌బోన‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ, బీజేపీల‌తో పొత్తు పెట్టుకోవాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. బీజేపీ.. టీడీపీతో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోతే టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అయితే 2014 మాదిరిగా సీట్లు తీసుకోకుండా ఏక‌ప‌క్షంగా టీడీపీకి మ‌ద్ద‌తిచ్చే ప‌రిస్థితి అయితే లేద‌నే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ తాను ఆశించిన సీట్లు ఇవ్వ‌క‌పోతే ప‌వ‌న్ ఒంటరిగా పోటీ చేసే యోచ‌న‌లోనూ ఉన్నార‌ని అంటున్నారు. త‌ద్వారా కాలం క‌ల‌సివ‌చ్చి.. స‌మీక‌ర‌ణాలు అన్నీ క‌ల‌సివ‌స్తే ప్ర‌భుత్వ ఏర్పాటులో కింగ్ మేక‌ర్‌గా నిల‌వాల‌ని ఆశిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే అక్టోబ‌ర్ 5 నుంచి ప‌వ‌న్ కల్యాణ్ బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లుమార్లు అక్టోబ‌ర్ 5 నుంచి తాను రోడ్ల మీద‌కు వ‌స్తాన‌ని.. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ విధానాలు, త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని ఘాటు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అక్టోబ‌ర్ 5న విజ‌య‌ద‌శ‌మి (ద‌స‌రా) పండుగ ఉంది. త‌న బ‌స్సు యాత్ర‌కు ప‌వ‌న్ ద‌స‌రా పండుగ‌ను ఎంచుకున్నారు. ఇప్ప‌టికే యాత్ర చేప‌ట్టే బ‌స్సు కూడా సిద్ధ‌మైంది. తుది మెరుగులు దిద్దుకుంటోంది. బ‌స్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల‌ను.. అన్ని జిల్లా కేంద్రాల‌ను, న‌గ‌రాల‌ను, మున్సిపాలిటీల‌ను, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ప‌వ‌న్ కల్యాణ్ బ‌స్సు యాత్ర ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర వాయిదా ప‌డింద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి అక్టోబ‌ర్ 5న బ‌స్సు యాత్ర చేప‌ట్టి ఆరు నెల‌ల‌పాటు యాత్ర చేయాల‌ని ప‌వ‌న్ ప్లాన్. దీని ప్ర‌కారం అక్టోబ‌ర్ 5న బ‌స్సు యాత్ర చేప‌డితే వ‌చ్చే ఏడాది మార్చి క‌ల్లా బ‌స్సు యాత్ర పూర్త‌యిపోతుంది. వ‌చ్చే ఏడాది మార్చి నుంచి చూసుకుంటే ఇంకా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఖ‌చ్చితంగా ఏడాది స‌మ‌యం ఉంటుంది. 2024 ఏప్రిల్‌/ మే నెల‌ల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ బ‌స్సు యాత్ర‌పై పార్టీలో కొద్ది రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 5 న యాత్ర మొద‌లుపెడితే ఆరు నెల‌ల్లో అంటే 2023 మార్చికి యాత్ర పూర్తయిపోతుంది. ఇక అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంటుంది. మ‌రి ఈ స‌మ‌యంలో ఏం చేయాల‌నేదానిపై పార్టీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తే అంత‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు యాత్ర మొద‌లుపెట్టి ఎన్నిక‌ల ప్ర‌చారం వ‌ర‌కు కొన‌సాగేలా యాత్ర ఉండాల‌ని జ‌న‌సేన ముఖ్య నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు చెబుతున్నారు.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని.. అప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాదే ఉంటాయ‌ని జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు భావించాయి. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల ప్రకారం.. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే 2024 వేస‌విలోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌ను మరి కొంత కాలం ఆగి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స‌మాచారం. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని.. ఒక‌టి రెండు రోజుల్లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం పవ‌న్ క‌ల్యాణ్.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాల‌ను చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్నిక‌ల గోదాలోకి దిగితే మంచిద‌నే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.