Begin typing your search above and press return to search.

పవన్ బస్సు యాత్ర : తెర వెనక ఇంత కధ ఉందా...?

By:  Tupaki Desk   |   11 Jun 2022 4:08 AM GMT
పవన్ బస్సు యాత్ర : తెర వెనక ఇంత కధ ఉందా...?
X
పవన్ కళ్యాణ్ రాజకీయంగా పెద్దగా వ్యూహాలు లేని వారుగా అంతా చూస్తారు. కానీ ఆయన రాజకీయాల మీద పూర్తి అభిలాషతో ఆసక్తితో ఎనిమిదేళ్ల క్రితం పార్టీ పెట్టారు. దాన్ని అలాగే ఆయన ముందుకు లాక్కువస్తున్నారు. ఇదంతా ఆయనకు పాలిటిక్స్ మీద ఉన్న పాషన్ తోనే జరుగుతోంది తప్ప మరోటి కాదు. ఆ రాజకీయ వ్యామోహమే పవన్ని రోజురోజుకీ రాజకీయంగా రాటుదేలేలా చేస్తోంది.

పవన్ కళ్యాణ్ మునుపటి మాదిరిగా ఏ రకమైనా వ్యూహాలు ఆలోచనలు లేని వారిగా చూస్తే తప్పే. ఆయన ప్రతీ అడుగులో మాటలో ఎన్నో అర్ధాలు పరమార్ధాలు కనిపిస్తాయి. ఆయన పొత్తుల గురించి ఇపుడే ఎందుకు మాట్లాడుతున్నారు అన్న సందేహం కూడా వచ్చిన వారికి ఆయన పాలిటిక్స్ ట్రిక్స్ అంత సులువుగా అర్ధం కావు. ఇపుడు పవన్ సడెన్ గా బస్సు యాత్ర అంటున్నారు. ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే పవన్ ఇపుడే ఎందుకు రోడ్ల మీదకు రావాలీ అన్న ప్రశ్నలు వేసిన వారికి కూడా ఇది అర్ధం కాని విషయమే.

కానీ పవన్ బస్సు యాత్రకూ ఒక లెక్క ఉంది. అదేంటీ అంటే పవన్ కళ్యాణ్ కి జనంలో ఎంత బలం ఉంది అన్నది తేల్చుకోవడానికే ఈ యాత్ర. దాన్ని స్వజనులకు, పర జనులకూ కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే పవన్ బస్సు యాత్ర చేస్తున్నారు. ముందుగా చెప్పుకుంటే జనసేనకు ఏముంది 2019 ఎన్నికల్లో రెండు చోట్లా అధినాయకుడే ఓడారు అని వైసీపీ బాహాటంగా అంటూంటే టీడీపీ వారు లోపల లోపల తేలిక చేసి మాట్లాడుతారు.

ఇక పవన్ పార్టీ కూడా పటిష్టంగా లేదని అనేవారు ఉన్నారు. ఆయన పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తారని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పవర్ షేర్ గురించి పవన్ మాట్లాడినపుడు టీడీపీ నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా జనసేన మీద తమ్ముళ్ళు సాగించిన యుద్ధం అంతా ఇంతా కాదు.

ఇపుడు అలాంటివి అన్నీ కూడా పవన్ లో అగ్గి రాజేశాయి. తన బలం ఏంటో జనంలోనే తేల్చుకోవడానికి ఆయన బస్సు ఎక్కుతున్నారు. ముందుగా జనసేన బలం ఏంటో టీడీపీకి చూపించాలనుకుంటున్నారని భోగట్టా. ఏపీ వ్యాప్తంగా ఆరు నెలల పాటు ఈ బస్సు యాత్ర సందర్భంగా జనసేనను పటిష్టం చేసుకునే వ్యూహం కూడా దాగుంది. అదే విధంగా లైట్ గా తమను తీసుకుంటున్న అధికార పార్టీ వైసీపీకి కూడా ఈ బస్సు యాత్ర ఒక హెచ్చరిక కానుంది.

మరో వైపు బీజేపీ లాంటి జాతీయ పార్టీకి జనసేన ప్లేస్ ఏపీలో ఏంటి అన్నది చూపించనుంది. అంటే బస్సు యాత్ర పేరిట పవన్ జనాల్లోకి రావడం వెనక బహుళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా పవన్ ఈ యాత్ర ద్వారా స్వయంగా తన పార్టీ లోపాలను తెలుసుకుని వాటిని ఎక్కడికక్కడ సరిదిద్దుకుని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. అవసరం అయితే చివరి ఆప్షన్ గా పెట్టుకున్న ఒంటరి పోరాటానికి కూడా రెడీ అయ్యేలా ఈ బస్సు యాత్ర ఉంటుందని అంటున్నారు.

ఇక కేవలం ఆరేడు శాతం ఓట్లు మాత్రమే జనసేనకు వచ్చాయని, పాతిక ముప్పై సీట్లు ఇచ్చి పొత్తు కధ ముగిద్దామనుకి టీడీపీ సహా ఏ పార్టీ అనుకున్న కాదు కూడదు అని చెప్పేందుకే పవన్ జనంలోకి వస్తున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోనే ఉండాలి, తన భాగం కూడా తేలాలి అన్న కచ్చితమైన ఉద్దేశ్యంతో, భారీ టార్గెట్ తో పవన్ బస్సు ఎక్కుతున్నారు.

ఒక వైపు మహానాడుకు లక్షల జనం వచ్చారని, బాదుడే బాదుడుకు జనాలు వెల్లువలా వచ్చారని, వార్ వన్ సైడ్ అని టీడీపీ వారు మహా గొప్పగా అంటున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. మరి తాము కూడా జనంలో ఉంటే తమ బలాన్ని చెప్పుకుని రేపటి రోజున పొత్తుల రాయబేరాలలో పై చేయి సాధించేందుకు వీలుగానే ఈ బస్సు యాత్రను జాగ్రత్తగా డిజైన్ చేశారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ తాను సారధిగా మారి రాజకీయ రధాన్ని తోలబోతున్నారు. మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.