Begin typing your search above and press return to search.

పవన్ బస్సు యాత్ర : కెలుక్కుంటున్న తెలుగు రాజకీయం ...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 12:30 AM GMT
పవన్ బస్సు యాత్ర : కెలుక్కుంటున్న తెలుగు రాజకీయం ...?
X
పవన్ కళ్యాణ్ మొత్తం మీద జనంలోకి వస్తున్నారు. తాను పార్ట్ టైమ్ పొలిటీషియన్ కాదు, ఫుల్ టైమ్ అని ఆయన చెప్పబోతున్నారు. సుదీర్ఘంగా ఆరు నెలల పాటు సాగే బస్సు యాత్రతో పవన్ జనసేనానిగా తాను ఏంటి అన్నది తెలియచేయాలనుకుంటున్నారు. సహజంగా అధినాయకుల యాత్రలు అంటేనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తాయి. ఆ మీదట యాత్ర చేసిన వారికి పుణ్యం కూడా భారీగానే దక్కుతోంది. ఇపుడు పవన్ కరెక్ట్ డైరెక్షన్ లోకే వచ్చారు ఆయన బస్సు యాత్రలో జనాలతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ పెట్టుకోబోతున్నారు.

దాంతో పవన్ బస్సు యాత్ర అంటే సహజంగానే ఏపీ రాజకీయాల్లో కీలక పార్టీలకు గుబులు పుడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న పార్టీ. ఇలా పవన్ బస్సుని నేరుగా జనంలోకి తీసుకెళ్ళి రాజకీయంగా బలపడితే కచ్చితమైన ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకుంటే అది తమకు ఇబ్బంది అవుతుందా అన్న ఆలోచనతో వైసీపీ ఉంది.

ఇక పవన్ బస్సు యాత్ర ద్వారా నేరుగా వైసీపీనే విమర్శిస్తారు. అందులో రెండవ మాటే లేదు. దాంతో ఇంతకాలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పవన్ చేసే విమర్శలకు జవాబును ఏ పేర్ని నానో మరో నేతతోనో చెప్పించేసి మమ అనిపిస్తున్నారు. రోజూ జనంలో ఉంటూ నెలల తరబడి వైసీపీని పవన్ టార్గెట్ చేస్తే దాన్ని ధీటుగా ఎదుర్కునే పరిస్థితి అక్కడ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పవన్ని లైట్ తీసుకోవడానికి అసలు వీలు లేదు, ఆయన మీద గురి పెట్టి తమ వైపు నుంచి కూడా జోరు పెంచాల్సిందే అన్న నిర్ణయం వైసీపీ తీసుకుంటుంది అని అంటున్నారు.

సరే వైసీపీ మీదనే పవన్ టార్గెట్ కదా అని తెలుగుదేశం శిబిరం హ్యాపీగా ఫీల్ అవుతోందా అంటే అది అసలు లేదుట. పవన్ ఇలా జనంలోకి వెళ్ళి చొచ్చుకుపోతే ఆయన గట్టిగా బలపడితే అటు ఇటూ తిరిగి తమకే డేంజర్ అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందిట. నిజానికి తెలుగుదేశం యాత్రలను స్టార్ట్ చేసింది. ఇంకా చినబాబు పాదయాత్ర కసరత్తు దశలో ఉంది.

చంద్రబాబుకు అచ్చొచ్చిన అక్టోబర్ 2 డేట్ మహాత్ముని జయంతి వేళ చినబాబు పాదం కదపబోతాడు అని ఆ పార్టీ మంచి ముహూర్తం సెట్ చేసుకుని పెట్టుకుంది. ఇంతలో ఆల్ ఆఫ్ సడెన్ గా జనసేనాని అక్టోబర్ 5న బస్సుయాత్రకు డేట్ ఇచ్చేశారు. దాంతో చినబాబు షెడ్యూల్ ముందుకా వెనక్కా ఎటు మార్చాలి అన్న టెన్షన్ లో టీడీపీ ఉందిట.

ఇక ఇపుడు పవన్ బస్సు యాత్ర పెట్టుకుంటే ఏపీ పొలిటికల్ ఫోకస్ మొత్తం అటు వైపు వెళ్తే తమ సంగతేంటి అన్న కలవరం కూడా తెలుగుదేశంలో ఉందని అంటున్నారు. చంద్రబాబు వయసు రిత్యా నెలకు కొన్ని జిల్లాలు వంతున కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. యువనేతగా భావి వారసుడిగా లోకేష్ ని జనంలోకి పాదయాత్ర ద్వారా పంపించి టీడీపీఎ వైపు ఏపీ రాజకీయం మొత్తం మళ్ళేలా మాస్టర్ ప్లాన్ వేశారు.

అయితే పవన్ బస్సు యాత్రతో నిజంగా ఇబ్బంది పడుతోంది టీడీపీ అని అంటున్నారు. మరో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. పవన్ అయితే బస్సు యాత్ర విషయంలో తగ్గేలా లేరు. సహజంగా సినీ నటుడు, అందునా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న యాక్టర్ గా పవన్ రోడ్ల మీదకు వస్తే కచ్చితంగా పవన్ బొమ్మ అక్కడ సూపర్ హిట్ అవడం ఖాయం. దాంతో పోల్చుకుంటే టీడీపీ నుంచి ఎవరు యాత్ర పేరిట దిగినా దిగదుడుపే అవుతుంది. అంతే కాదు ఏపీ పాలిటిక్స్ సైతం తన వైపునకు తీసుకువెళ్ళేలా పవన్ బస్సు యాత్ర ఉంటుంది.

ఈ పరిణామాలతో టీడీపీ శిబిరంలో బస్సు యాత్ర మీద వేడిగానే చర్చ సాగుతోందిట. ఇదంతా టీడీపీని దెబ్బ తీయడానికే అని కూడా కొందరు అంటూంటే అనుకూల మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలలో టీడీపీ సానుభూతి పరులు అయితే పవన్ ఇపుడు యాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుని టీడీపీని సైడ్ చేసేందుకే ఈ రాజకీయం అని అన్న వాళ్ళూ ఉన్నారు. తన సొంత పార్టీ, సొంత రాజకీయ విధానాలతో పవన్ బస్సు యాత్ర అంటే టీడీపీ అనుకూలురు కస్సుబుస్సులాడుతున్నారు అంటే రేపటి రోజున నిజంగా పవన్ బస్సు యాత్ర బంపర్ సక్సెస్ అయితే ఇక ఎలా ఉంటుందో చూడాలి అని అంటున్నారు.