Begin typing your search above and press return to search.

పొత్తులకు ఒక కండిషన్... పవన్ సంచలనం

By:  Tupaki Desk   |   12 Jan 2023 4:30 PM GMT
పొత్తులకు ఒక కండిషన్... పవన్ సంచలనం
X
పొత్తుల దిశగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయని అంతా గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో ఆయన మాట్లాడుతూ బలవంతుడైన శత్రువుని ఎదుర్కొనే క్రమంలో ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని సార్లు కొందరు కలవాల్సి వస్తుంది అని అన్నారు.

అయితే ఇదంతా ప్రజల కోసం, వారు మంచి కోసమే అని ఆయన చెప్పుకున్నారు. కానీ ఈ కలిసే క్రమంలో మన గౌరవానికి భంగం కలగకుండా ఉంటేనే ముందుకు సాగుతాం తప్ప అంటూ ఒక కండిషన్ పెట్టారు. లేకపోతే ఒంటరిగా అయినా పోటీకి సిద్ధం అంటూ ఆయన స్పష్టం చేయడంతో తెలుగుదేశం పొత్తుల గురించే పవన్ ఈ మాటలు అన్నారని అంటున్నారు.

తెలుగుదేశంతో పొత్తులు కేవలం జగన్ని గద్దె నుంచి దించడం కోసమే రాష్ట్రం కోసమే అని పవన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అంతమాత్రం చేత తాము తగ్గబోమని, తమ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోబోమని చెప్పరు. మరి పవన్ చెబుతున్న ఆ గౌరవం ఏంటి, దాని అర్ధం పరమార్ధం ఏమిటి అన్న దాని మీదనే ఇపుడు చర్చ నడుస్తోంది.

పవన్ కోరుకునే గౌరవం అంటే తెలుగుదేశంతో సరిసమానంగా జనసేనను కూడా ట్రీట్ చేయాలన్న కోరిక ఉందా అన్నది కూడా పాయింట్ కి వస్తోంది. అలా కనుక చూసుకుంటే జనసేనకు కూడా అధికారంలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. అంటే పవన్ సీఎం అన్న మాట. మరి ఆ విధంగా జనసేనకు అధికార వాటా ఇచ్చేలా తెలుగుదేశం ముందుకు వస్తేనే పొత్తులు ఉంటాయని చూచాయగా పవన్ రణస్థలం సభా వేదిక నుంచి చెప్పుకొస్తున్నారా అన్నదే కీలకమైన పాయింట్ గా చూడాల్సి ఉంటుంది.

నిజానికి ఇపుడున్న పరిస్థితులల్లో జనసేనకు పొత్తుల విషయంలో వెంపర్లాడాల్సిన పని లేదని అంతా అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే పొత్తులు అవసరం అని అంటున్నారు దాంతో పాటుగా ఏపీ బాగు కోసం రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నపుడు కలసి సాగుతున్నపుడు ఆ విధంగా ఒక మాట మీద నడుస్తున్నపుడు సమానంగా ఇద్దరికీ గౌరవం ఉండాలి అన్నదే పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

అంటే ఈ పొత్తులలో పెద్దన్న చిన్నన్న అని ఎవరూ కాకుండా సమాన స్థాయిలోనే ఇద్దరూ కలసి సాగాలన్నది ఆయన ఉద్దేశ్యమా అన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. అదే కనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం అయితే తెలుగుదేశం ఆ దిశగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక ఇదే సభలో గౌరవం దక్కకపోతే ఒంటరి పోరుకైనా సిద్ధమని పవన్ ప్రకటించడం బట్టి ప్లాన్ బీని కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు అన్న డౌట్లూ ఉన్నాయి.

ఏది ఏమైనా పొత్తుల విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు దాని మీద చెలరేగుతున్న వివాదాలు, జనసేనకు తక్కువ సీట్లు ఇస్తున్నారు అని జరుగుతున్న ప్రచారం వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జనసైనికుల మనోభావాలను సైతం గుర్తించి పవన్ ఈ కీలక కామెంట్స్ చేశారు అని అంటున్నారు. సభకు వచ్చిన వారు అంతా పవన్ సీఎం అని నినాదాలు చేస్తున్నారు. దాంతో పవన్ వారికి డైరెక్ట్ గా ఒక సందేశం ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుని కలసి వచ్చిన తరువాత కూడా పవన్ నోటి వెంట మరో మారు ఒంటరి పోరు అని వస్తోంటే పొత్తులకూ ఒక కండిషన్ ఉందని అర్ధమవుతోంది. మరి అది నెరవేర్చే బాధ్యత మాత్రం కచ్చితంగా బాబు చేతిలోనే ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.