Begin typing your search above and press return to search.

తరలింపు తాత్కాలికమే..శాశ్వత రాజధాని అమరావతే!

By:  Tupaki Desk   |   21 Jan 2020 6:51 AM GMT
తరలింపు తాత్కాలికమే..శాశ్వత రాజధాని అమరావతే!
X
మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే - మూడు రాజధానులు శాశ్వతం కాదనీ - వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ మూడు రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాశ్వతమైన పరిపాలనా రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుందన్నారు. అది జనసేన-బీజేపీ పార్టీలతోనే సాధ్యమవుతుందనీ, మూడు రాజధానుల ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

వైసీపీకి నాశనం మొదలైందని... పోలీసులను నియమించి - ప్రజలను భయభ్రాంతులను చేసిందనన్నారు. నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలను ప్రయోగించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిందని మండిపడ్డారు. విశాఖ - కర్నూలులో ఏర్పాటు చేస్తున్న పరిపాలనా రాజధాని - న్యాయ రాజధాని ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు అని - విశాఖలో పుష్కలంగా ఉన్న భూసంపదను చేజిక్కించుకోవడమే వైసీపీ పెద్దల వ్యూహమంటూ విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్థిస్తున్నామని, కానీ వైసీపీ ప్రతిపాదించిన 3రాజధానులకు తాము వ్యతిరేకమని చెప్పారు. రాజధాని పేరుతో అప్పట్లో టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్‌ ఎస్టేట్‌ చేస్తోందని ఆరోపించారు.

మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేయటంతో..భవిష్యత్ కార్యాచరణ గురించి పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చించాలని నిర్ణయించారు. ఈ రోజు బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చిస్తామని స్పష్టం చేసారు. పోలీసుల లాఠీచార్జ్ లో గాయాల పాలైన వారిని పరా మర్శించేందుకు వెళ్తానంటే పోలీసులు అడ్డుకోవటం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు ఎలాగైనా బాధితులను పరామర్శించాలని జనసేన భావిస్తోంది. పవన్ పర్యటనను అడ్డుకున్న పోలీసులు..ఒక రకంగా పవన్ ను పార్టీ కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేసారు. వైసీపీ లాంటి విభజించి పాలించే పార్టీని అడ్డుకోవాలంటే బీజేపీ- జనసేన వల్లే సాధ్యమని పవన్‌ తెలిపారు. ప్రభుత్వం - పోలీసుల తీరు దుర్మార్గమని పవన్‌ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు.