Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి ఏపీ రాజ‌ధాని కాదు..టీడీపీ రాజ‌ధాని

By:  Tupaki Desk   |   26 March 2018 12:05 PM GMT
అమ‌రావ‌తి ఏపీ రాజ‌ధాని కాదు..టీడీపీ రాజ‌ధాని
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ఘాటుగా స్పందించారు. ఈ ద‌ఫా ఏపీ ముఖ్య‌మంత్రి క‌ల‌ల ప్రాజెక్టు అయిన అమ‌రావ‌తిపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,చంద్ర శేఖర్,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు - పార్టీ నేత వెంకటేశ్వరరావు త‌దిత‌రులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చ - ప్రత్యేక హోదా - భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ప్రతీ అంశం లోనుకేంద్రం తో లాలూచీ పడిందని ఆరోపించారు. పుష్కరాలకు అనేక కోట్లు ఖర్చు పెట్టారని, కానీ ప్రజలు చనిపోతుంటే పట్టించుకోకుండా ఉన్నారన్నారు. ప్రతి అంశంలో బలమైన వైఫల్యాలు టీడీపీ కనబరుస్తుందన్నారు. అమరావతి ఏపీ ప్రజలకు సంబంధించిన రాజధానిలా కనిపించడం లేదు.. టీడీపికి సంబంధించిన రాజధానిలా మారిందని మండిపడ్డారు. టీడీపీ తీరుతో రాష్ట్రానికి తీరనినష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన కోసం జనసేన - సీపీఐ - సీపీఎం కలిసి పనిచేస్తాయని పవన్‌ తెలిపారు. అమిత్ షా ఒక రాష్ట్రం ఎలా బాగుపడాలి, అభివృద్ధి ఎలా సాధ్యం అని ఆలోచించాలి కానీ ఇలా మాట్లాడకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు గానే మాట్లాడాడని - దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం నుండి లేఖ‌ వస్తే స్పందిస్తామని పవన్ సూచించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని టీడీపీ వారు అప్పుడు అన్నారని - తిరుపతి సభలో మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజి ఇస్తామని చెప్పారన్నారు. ఆ తరువాత అనేక విరుద్ద ప్రకటనలు చేసారని, మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయ‌ని అన్నారు.

ఏప్రిల్ 4న విజయవాడలో మరో సారి సమావేశం అవుతామని పేర్కొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇందులో వామపక్షాలు - ప్రజాసంఘాలు - మేధావులు పాల్గొని హోదా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ - వైసీపీ - కాంగ్రెస్ పార్టీల ప్రకటనలతో ప్రజల్లో గందరగోలం నెలకుందని - అందుకే పవన్ కల్యాణ్ తో కలిసి వామపక్షాలు వెళతామని సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రత్యేక హోదాపై అనంతపురం నుండి తాము ఉద్యమం మొదలు పెడతామని, తర్వాత ప్రకాశం - విశాఖ - జిల్లా వెనకపడిన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించామన్నారు.