Begin typing your search above and press return to search.

బాబును అలా అడిగేస్తావేంటి ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   7 Dec 2017 2:47 PM GMT
బాబును అలా అడిగేస్తావేంటి ప‌వ‌న్‌!
X
ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తానంటారు ప‌వ‌న్‌. టీడీపీ.. బీజేపీ.. ఎవ‌రైనా స‌రే క‌డిగేయ‌ట‌మే అన్న‌ట్లుగా మాట్లాడ‌తారు. మ‌రి.. వారిద్ద‌రూ మీకు మిత్రులు క‌దా? అంటే.. నేను ప్ర‌జ‌ల మ‌నిషిని.. ప్ర‌జ‌ల కోసం ఎవ‌రినైనా అడిగేస్తా.. క‌డిగేస్తా.. అందులో మ‌రో మాట‌కు తావు లేద‌నేస్తాడు. మ‌రి.. ఇదంతా నిజ‌మ‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటారా? ఇక్క‌డే ఉంది అస‌లు విష‌య‌మంతా.

సాధార‌ణంగా ఏదైనా ప్రాజెక్టు ప‌ని జ‌రుగుతున్న వేళ‌.. వివాదం చోటు చేసుకుంటే.. ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు రాజ‌కీయ నేత‌లు వెళుతున్నారంటే చాలు.. భారీ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల్ని మొహ‌రిస్తారు. స‌ద‌రు రాజ‌కీయ నేత‌ను ప్రాజెక్టు ద‌గ్గ‌ర‌కు కాదు క‌దా.. కిలోమీట‌ర్ల ముందే నిలిపేస్తారు.

మ‌రి.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు వెళ‌తామ‌న్నంత‌నే.. ఏపీ రాష్ట్ర స‌ర్కారు అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేయ‌ట‌మే కాదు.. కారులో వ‌చ్చిన ప‌వ‌న్‌ కు పోలీసులు స్వాగ‌తం ప‌లికారు. ప్రాజెక్టు ఎస్ ఈ స్వ‌యంగా ప్రాజెక్టు మీద ప‌వ‌న్‌ కు అవ‌గాహ‌న క‌ల్పించే ప‌నిలో ప‌డ్డారు.

ప్రాజెక్టును కాస్త చూసిన జ‌న‌సేనాధినేత ఎప్ప‌టిమాదిరే మ‌రోసారి ప్రాజెక్టుకు వ‌స్తా.. అప్పుడు మొత్తం చూస్తానంటూ చెప్పేసి మీడియాతో మాట్లాడారు. చుట్టూ చేరిన అనుచ‌ర‌వ‌ర్గం వ‌ల్ల‌నో.. త‌న‌ను చూడ‌టానికి భారీగా చేరుకున్న అభిమానుల వ‌ల్ల‌నోకానీ.. అప్ర‌య‌త్నంగా ఆయ‌న నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చేశాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టు విష‌యంలో ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని.. అవ‌క‌త‌వ‌క‌లు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పేట‌ట్లైయితే.. నిధుల కోసం సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయ‌టం కోసం పోరాడేందుకు తాను సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చంద్ర‌బాబు అనుకుంటే ధైర్యంగా ముంద‌డుగు వేయాల‌న్నారు. తెలిసి మాట్లాడ‌తారో.. తెలీకుండా మాట్లాడ‌తారో కానీ ప‌వ‌న్ మాట‌లు కాస్త చిత్రంగా ఉంటాయి. నిన్న‌టికి నిన్న విశాఖ‌లో ఆయ‌న మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతి గురించి త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. రోజు గ‌డిచేస‌రికి ప‌వ‌న్ టోన్ మారిపోవ‌టం గ‌మ‌నార్హం.

2018 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయ్యే సూచ‌న‌లు త‌న‌కేమీ క‌నిపించ‌టం లేద‌న్న ఆయ‌న‌.. ప్రాజెక్టును సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల్సిన బాధ్య‌త రాష్ట్రం మీద ఉంద‌న్నారు. ప్రాజెక్టు పూర్తికి అవ‌స‌ర‌మైన నిధుల్ని స‌మ‌కూర్చాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ఉంద‌న్నారు. కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేద్దామ‌ని చెప్ప‌టం వ‌ర‌కూ బాగానే ఉన్నా.. అవినీతి జ‌ర‌గ‌లేదా? లోపాలు ఏమీ లేవా? అంటూ సూటిగా అలా అంద‌రి ముందు అడిగేస్తే బాబు లాంటి స్నేహితుడు త‌ట్టుకోగ‌ల‌డా? ముందు వెనుకా ఆలోచించ‌కుండా మాట్లాడేసి.. బుక్ చేయ‌టం ఏమైనా బాగుందా ప‌వ‌న్‌?