Begin typing your search above and press return to search.
బాబుకు అనుభవం కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ- పవన్
By: Tupaki Desk | 3 March 2018 1:17 PM GMTఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో మరింత వేడెక్కింది. గత పదిహేనురోజులుగా కసరత్తు చేస్తున్న నివేదికను పూర్తి చేసిన జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ ఆసక్తిగా మారింది. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగానే జనసేన పార్టీ పుట్టిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న జేఎఫ్ సీ నేతలకు అభినందనలు తెలుపుతున్నాన్నారు. జేఎఫ్‌సీ 11 అంశాలను గుర్తించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని మరోసారి స్పష్టం చేశారు. 90శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే పాచిపోయిన లడ్డూలని తాను చెప్పానని పవన్ గుర్తుచేశారు. రాష్ట్ర అవసరాల కోసం పాచిపోయిన లడ్డూలైనా తీసుకుంటామని టీడీపీ నేతలన్నారని, ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు కూడా పూర్తిగా రాలేదని పవన్ దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లయినా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు అనుభవముందని ఆయనకు మద్దతిస్తే ఆయనే కన్ఫ్యూజన్ ఉంటే ఎలా ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు విరుద్దమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారన్నారు. ప్రజలను కూడా కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నాలుగేళ్లు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మీపై ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అడిగారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందా? లేదా అవగాహన లేక చేస్తుందా అనేది అర్థం కావడం లేదన్నారు. పోలవరం ఖర్చంతా కేంద్రమే భరించాలని విభజన చట్టంలో ఉందని, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోకుండా ఉంటే బాగుండేదన్నారు. ఇబ్బందుల్లేకుండా పోలవరం సకాలంలో పూర్తి చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పుండుమీద కారం చల్లుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదాతో ఏదీ సమానం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం 5శాతం మాత్రమేనని పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ విద్యా సంస్థలకు కేంద్రం ఇచ్చింది నామమాత్రమేనన్నారు. పూర్తి నిధులు ఇవ్వడానికి కేంద్రానికి ఎన్ని దశాబ్ధాలు కావాలని ప్రశ్నించారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రజల్ని పాలించే నైతికత కోల్పోతారన్నారు. ఒకర్ని తప్పు పట్టాలనే ఉద్దేశం మాకు లేదన్నారు. విభజన లో నేతల పాత్ర ఉంది కానీ, ప్రజలపాత్ర లేదన్నారు. ఎన్డీఏ విజయానికి నావంతు కృషి చేశానన్నారు. ప్రత్యక హోదా ఇస్తారని తాను కూడా నమ్మానని పవన్ పేర్కొన్నారు.
జేఎప్ సీ నివేదికపై మీడియాతో లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.74,542కోట్లు రావాల్సి ఉందని అన్నారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందన్నారు. వెనుకబడిన 7జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. పోలవరంలో డబ్బుల ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి సాయం చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాజధానిలో మౌలిక వసతులు, రహదారులు, రైళ్ల సదుపాయానికి కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కు మద్దతివ్వాలని జేఎఫ్ సీ నిర్ణయించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని జేఎఫ్ సీ తెలిపింది. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేని తెలిపింది. రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది.