Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండానే కొత్త జిల్లాలు: ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   4 April 2022 7:55 AM GMT
ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండానే కొత్త జిల్లాలు: ప‌వ‌న్‌
X
ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాల‌తో ఏపీ నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింది. 13గా ఉన్న జిల్లాల‌ను 26కు పెంచుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమ‌వారం తాడేప‌ల్లిగూడెం నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో కొత్త జిల్లాల‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. అయితే ప్ర‌జ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా.. ప్ర‌జాభిప్రాయానికి విలువ ఇవ్వ‌కుండా జిల్లాల పున‌ర్విభ‌జ‌న చేశార‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఏపీ ప్ర‌భుత్వం జ‌నాల మాట‌ల‌ను ప‌రిణ‌గ‌లోకి తీసుకోకుండా జిల్లాల విభ‌జ‌న చేసింద‌ని ఆయ‌న అన్నారు.

13 జిల్లాల‌ను 26గా మారుస్తూ గ‌తంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల మార్పు, రెవిన్యూ డివిజ‌న్లు.. ఇలా పార్టీలు, ప్రజ‌ల నుంచి అభ్యంత‌రాలు వెల్లువెత్తాయి. ఆ అభ్యంత‌రాల‌ను స్వీక‌రించిన ప్ర‌భుత్వం వాటిని ప‌రిశీలించి తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.

అయితే ఏపీ ప్ర‌భుత్వం జిల్లాల విభ‌జ‌న‌, పేర్ల విష‌యంలో ఎక్క‌డా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వ‌లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శించారు. మొత్తానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జిల్లాల విభ‌జ‌న లోప‌భూయిష్టంగా జ‌రిగింద‌న్నారు. ఎప్ప‌టి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాల‌పై అస‌లు అధ్య‌య‌న‌మే చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు, పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్టింద‌న్నారు.

జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జా సౌక‌ర్యం మేర‌కు జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించే బాధ్య‌త తీసుకుంటుంద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లాకు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య పేరు పెడ‌తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు కొత్త జిల్లాల్లో ఈ రోజు నుంచే పాల‌న మొద‌లైంది. జిల్లాల‌ను జ‌గ‌న్ ప్రారంభించి త‌ర్వాత క‌లెక్ట‌ర్లు బాధ్య‌త‌లు తీసుకున్నారు. మ‌రి జిల్లాల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు వైసీపీ నేత‌లు ఏ ర‌కంగా స‌మాధానం చెబుతారో చూడాలి.