Begin typing your search above and press return to search.

నాగబాబు ట్వీట్లపై స్పందించిన పవన్

By:  Tupaki Desk   |   23 May 2020 11:10 AM GMT
నాగబాబు ట్వీట్లపై స్పందించిన పవన్
X
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య వరుసగా జాతిపిత మహాత్మాగాంధీని అవమానించేలా గాడ్సేనే దేశభక్తుడిగా పోలుస్తూ వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనితో మొదలైన వివాదాలు రాజకీయ నేతలపై విమర్శల దాకా వెళ్లింది. కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ కంటే అంబేద్కర్, అబ్దుల్ కలాం, సావర్కర్, పీవీ నరసింహారావ్, వల్లభాయ్ పటేల్, వాజ్ పేయి బొమ్మలు చూడాలని ఉందని నాగబాబు వివాదాస్పద ట్వీట్లు చేశారు.

తాజాగా ఈ వరుస వివాదాస్పద ట్వీట్లు చేసిన జనసేన నేత నాగబాబు తీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అయిన నాగబాబు చేసిన వ్యక్తిగత ట్వీట్లు, అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మూడు రోజులుగా నాగబాబు చేస్తున్న వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని.. వీటితో జనసేన పార్టీకి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.

ఇక కరోనా కష్టకాలంలో ప్రజాసేవ తప్ప ఎటువంటి అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు, నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు.

జనసేన నాయకుల వ్యక్తిగత అభిప్రాయలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. కొన్ని సున్నితమైన అంశాలపై ఈ మద్య పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని పవన్ కళ్యాన్ లేఖలో పేర్కొన్నారు.

వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాలు, నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా తాను అధికారికంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలా అధికారికంగా చేసిన ప్రకటనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని.. ఎవరూ కూడా క్రమశిక్షణ అతిక్రమించవద్దని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.