Begin typing your search above and press return to search.

ఓర్వలేక పోతున్న పవన్ కళ్యాణ్ ?

By:  Tupaki Desk   |   17 March 2018 4:30 AM GMT
ఓర్వలేక పోతున్న పవన్ కళ్యాణ్ ?
X
తన ప్రమేయం లేకుండానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేస్తే ఎలాగా? ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తాను ప్రకటించిన తర్వాత... ఆ దీక్ష గురించిన ఊసు సోదిలో లేకుండా పోయేలాగా... రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఒకే లక్ష్యంతో ఒకే మార్గంలో ఉద్యమిస్తే ఎలాగా? వారి ద్వారా ప్రత్యేక హోదా వచ్చేస్తే తన హీరోయిజం ఏమైపోవాలి? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విపరీతంగా మధన పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

ఒకరికి ఒకరు సహకరించుకోకపోయినప్పటికీ తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలూ అవిశ్వాస తీర్మానం అనే మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ కు చిరాకు కలిగించినట్లు గా కనిపిస్తోంది. అందుకే ఆయన అవిశ్వాస తీర్మానం అనే దానికి ఏమాత్రం విలువ లేదు ... అది ఎందుకూ కొరగాని ప్రయత్నం అన్నట్లుగా ప్రస్తుతం మాట్లాడుతూ ఉండటం విశేషం.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండూ, పరస్పరం వీర బీభత్స స్థాయిలో కుమ్ములాడుకుంటూ ఉన్న నేపథ్యంలో ... వీరిద్దరూ కలిసి ఒకే మార్గంలో నడవడం , కలవకపోయినా ఒకే మార్గంలో నడవడం అసాధ్యం అని పవన్ కళ్యాణ్ భావించారేమో... అందుకే దమ్ముంటే అవిశ్వాసం పెట్టండి అంటూ ఆ రెండు పార్టీలను రెచ్చగొట్టారు . ఆ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిన తర్వాత అయినా, ఇప్పుడు ఇద్దరూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సందర్భం వచ్చింది. పవన్ ప్రకటించినట్లుగా ఆయన మద్దతు కూడగట్ట వలసిన అవసరం లేకుండానే... ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంటే నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన అవిశ్వాసం తీర్మానం అని వ్యవహారంలో, ఇప్పుడు ఆయన పూర్తిగా జీరో అయిపోయారు. ఆయన ప్రమేయం గురించి సాయం గురించి పట్టించుకున్న వారు ఎవ్వరూ లేరు.

పైగా అవిశ్వాసం వంటి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్న తరుణంలో ఇక పవన్ ప్రకటించిన ఆమరణ నిరాహారదీక్ష లాంటి మొక్కుబడి దీక్షలకు విలువ లేకుండా పోయింది. ఈ అసహనాన్ని పవన్ కళ్యాణ్ దాచుకోలేక పోతున్నారు . అందుకే అవిశ్వాసం పేరుతో రెండు పార్టీలు ప్రయోజనం సాధించని డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు . తాను మాట మారుస్తున్నట్లుగా ప్రజలు గుర్తిస్తారని భయం కూడా పవన్ కు లేనట్లుగా కనిపిస్తోంది.