Begin typing your search above and press return to search.

జగన్ ఇగోను తప్పు పట్టారా? అన్నయ్యను పవన్ టార్గెట్ చేశారా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 6:38 AM GMT
జగన్ ఇగోను తప్పు పట్టారా? అన్నయ్యను పవన్ టార్గెట్ చేశారా?
X
కాయలున్న చెట్లకు రాళ్ల దెబ్బలు అన్నట్లుంది మెగా ఫ్యామిలీ ఇష్యూ. వారిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్లుగా అనేసే బ్యాచ్ ఎక్కువే. దీనికి కారణం లేకపోలేదు. రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా మెగా ఫ్యాన్స్ భారీగా ఉంటారు. అదే సమయంలో మిగిలిన కొంతమంది హీరోల మాదిరి విరుచుకుపడటం కాకుండా.. తమను ఏమన్నా పోనీలే అన్నట్లుగా ఉంటారు. వారి పెద్ద మనసు చాలామందికి ఒక బలహీనతగా కనిపించి.. టార్గెట్ చేసి ప్రముఖులుగా చలామణీ కావాలన్న తీరు ఉంటుంది.

ఎవరిదాకానో ఎందుకు.. శ్రీరెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనం. ఆమెకు ఆమెనే.. ఈ మధ్యన చిరంజీవి తల్లిని ఉద్దేశించి తాను తప్పుగా మాట్లాడానని.. తాను అలా మాట్లాడటానికి కొందరు కారణమని చెప్పటం తెలిసిందే. ఆ మధ్యన వివాదాస్పద దర్శకుడు వర్మ సైతం ఒక ఇంటర్వ్యూలో తాను శ్రీరెడ్డికి ఎలా మాట్లాడాలన్న దానిపై సలహాలు.. సూచనలు ఇచ్చేవాడినని చెప్పటం మర్చిపోకూడదు.

ఇదంతా ఎందుకంటే.. నరసాపురం సభలో పవన్ వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి ఉక్కపోతకు గురి చేశాయి. జగన్ ప్రభుత్వ విధానాన్ని సూటిగా తప్పు పట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉండటం.. అందులో న్యాయం ఉండటంతో.. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకే.. కొత్త పాటను అందుకున్నారు. పవన్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని తీసుకొని తన అన్నచిరంజీవిని చులకన చేసేలా.. ఆయన్ను తక్కువ చేసేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. విషయాన్ని పక్కదారి పట్టించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి భావాలు వారివి. ఈ విషయంలో చిరు.. పవన్ లు చాలా స్పష్టంగా ఉంటారు. నిజానికి చిరంజీవి.. పవన్ కల్యాణ్ మనస్త్తత్వాన్ని చూస్తే ఇద్దరు భిన్నధ్రువాలు. ఒకరు సాధు స్వభావంతో ఉన్న వారు.. మరొకరు సాధు స్వభావంతో ఉంటూనే.. అవసరమైతే అగ్గి బరాటాగా వ్యవహరించే నేర్పు ఉన్నవారు. నరసాపురం సభలో జగన్ ఇగోను ప్రస్తావిస్తూ.. ఎంతటి పెద్ద వారైనా.. మాకు సాయం చేయాలి సార్ అని ఆయన వద్దకు వెళ్లాలి. అప్పుడే ఆయన అహం సంతృప్తి చెందుతుంది. అందరూ తన వద్ద తగ్గారనే తృప్తి చెందుతుందనే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఈ వ్యాఖ్యల్ని చూసినప్పుడు చిరును టార్గెట్ చేశారనే కన్నా.. చిరు లాంటి వ్యక్తిని సాయం చేయాలన్న పరిస్థితికి తీసుకొచ్చారన్న ఆవేదన.. ఆక్రోశం కనిపిస్తుంది. కానీ.. పవన్ మీద కత్తి దూయాలని ప్రయత్నించే వారు మాత్రం.. పవన్ మాటలకు పెడర్థాలు తీసి.. తమ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. మొన్నీమధ్య సీఎం జగన్ తో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు వెళ్లిన భేటీలో ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. ఆయనవెంట ఉన్న వారంతా.. సార్.. సార్.. మీరు పెద్ద మనసు చేసుకోవాలంటూ ప్రాధేయపడిన వైనం తెలిసిందే.

సినిమా రంగానికి చెందిన పెద్దలు ఇలా ఒక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రాధేయపడటం ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే పవన్ లాంటి వారికి అస్సలు నచ్చదు. అవసరమైతే.. నా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటానని చెప్పే దమ్మున్న పవన్.. సీఎం జగన్ తీరును వేలెత్తి చూపేలా ప్రశ్నించారే అని చెప్పాలి. అలా చెబితే.. పవన్ హీరో అవుతారు. మరి.. ఆయన్ను జీరో చేయాలంటే.. పవన్ ప్రాణానికి ప్రాణంగా భావించే అన్నయ్యను కించపరిచేలా మాట్లాడారన్న దరిద్రపుగొట్టు వాదనను.. తమకు అండగా నిలిచే మీడియాలోనూ.. సోషల్ మీడియా వేదిక మీద ఇష్టారాజ్యంగా విపిపించటం ద్వారా విషయాన్ని పక్కదారి పట్టించాలన్న దుగ్దే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.