Begin typing your search above and press return to search.

పవన్... ఈ కులాల గోలేమిటీ..!!?

By:  Tupaki Desk   |   13 Aug 2018 3:30 PM GMT
పవన్... ఈ కులాల గోలేమిటీ..!!?
X
రాజకీయ నాయకులు కులాల ఊసేత్తకుండా రాణించాలంటే భారతదేశంలో జరగని పని. ఈ విషయం అటు రాజకీయ నాయకులకు... ఇటు ప్రజలకు కూడా చాలా బాగా తెలుసు.తెలియందల్లా వెండితెర మీంచి వచ్చిన నటులకే. ఈ విషయంలో తాను మినహాయింపు అని - తనకు కులాలు... మతాలు లేవంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పేవారు. దీనిపైనే ఆయన అనేక చోట్ల ప్రసంగాలు కూడా చేశారు. ఇదంతా చూసిన వారికి వామ్మో... ఈ పవనుడు కొత్తగా చెబుతున్నాడే అని ఒకింత ఆనందం... ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. తన కులానికి కూడా తాను ప్రాధాన్యం ఇవ్వనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన స్వకులంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా సరే తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని - ఇది తన నిర్ణయం అని కూడా ఆయన చెప్పారు. కాపులు కించిత‌ కినుక వహించారు.

ఎన్నో ఎన్నికలు చూసిన వారు కదా... దీంతో కాపులు " ఆ ఏముందిలే... ఇవన్నీ ఆదర్శాలు వల్లించేందుకే... కొన్నాళ్ల తర్వాత ఈయన కూడా మన దగ్గరకు రావాల్సిందే " అని స్థిమిత పడ్డారు. అలాంటి వారిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా ఉన్నారు. వారు అనుకున్నదే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌‌ లో పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్‌ కు తత్వం బోధపడింది. దీంతో ఆయన కులాల వెంట పడడం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ముందుగా న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కూడా పవన్ కులాల ప్రస్తావన తీసుకురాలేదు. ఆ తర్వాత ఏమైందో కాని ఆయన జిల్లాలో వరుసగా కుల సంఘాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా బీసీలతో సమావేశమైప పవన్ కల్యాణ్ కాపులకు రిజర్వేషన్లపై తాను స్పందించనని - రాష్ట్రంలో బీసీలు ఎంతో వెనుకబడి ఉన్నారని వారిపై సానుభూతి చూపించారు. ఆ తర్వాత బ్రాహ్మణులతో సమావేశమయ్యారు. వీరిని కాసింత ఎక్కువగానే దువ్వాలనుకున్నారు. సమాజంలో బ్రా‌హ్మణుల పాత్ర ఎంతో ఉందని, వారి నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు.

అంతే కాదు... సమాజానికి మేలు చేయడంలో బ్రాహ్మణులు ముందుంటారని కొనియాడారు. ఆ తర్వాత భీమవరం చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ క్షత్రీయులతో సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియులది కీలక పాత్ర. ఆ విషయం ఆ జిల్లాకే చెందిన పవన్ కల్యాణ్ చాలా బాగా తెలుసు. అందుకే వారితో సమావేశమై వారిని కూడా యథాశక్తి పొగడ్తలతో ముంచెత్తారు. రానున్న రోజుల్లో మిగిలిన కులాల వారితో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పార్టీ ప్రారంభానికి ముందు కాని, ప్రారంభించిన తర్వాత కాని పవన్ కల్యాణ్ తాను కులాలకు - మతాలకు వ్యతిరేకినని చెప్పారు.

అంతే కాదు... కులం కూడు పెట్టదని కూడా సెలవిచ్చారు. అయితే హఠాత్తుగా కులాల వారీగా ఆయన సమవేశాలు నిర్వహించడంపై ఆయనలోని కులతత్వం బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కులాల వారీగా ఓట్లు కొల్లగొట్టడం కోసం అన్ని పార్టీలలాగే పవన్ కల్యాణ్ కూడా కులాల బాట పడుతున్నారని అంటున్నారు. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడాలో రాజకీయ నాయకులకు ముందే తెలిసుండాలి... లేకపోతే ఇదిగో ఇలాగే దొరికిపోతారు.