Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క్లారిటీ!... బాబుది త‌ప్పేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Jan 2018 6:39 AM GMT
ప‌వ‌న్ క్లారిటీ!... బాబుది త‌ప్పేన‌ట‌!
X
ఓటుకు నోటు కేసు... రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద అగాథాన్నే ఏర్ప‌ర‌చిన కేసు. అంతేనా... ప‌దేళ్ల పాటు హైద‌రాబాదు నుంచే పాల‌న సాగించే వీలున్నా... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును ఉన్న ప‌ళంగా విజ‌య‌వాడ‌కు ప‌రుగులు పెట్టించిన కేసు కూడా ఇదే. 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఏ ఒక్క చోట కూడా ప‌ట్టుబ‌డ‌కుండానే నెట్టుకు వ‌స్తున్న‌ నేత‌గా చెప్పుకుంటున్న చంద్ర‌బాబుపై పెద్ద మ‌చ్చ‌నే వేసేసిన కేసు  ఇది. మ‌చ్చ లేని నేత‌గా ఇప్పుడెలా చెప్పుకుంటారో తేల్చండి అంటూ విప‌క్షాలు టీడీపీపైనా - చంద్ర‌బాబుపైనా విరుచుకుప‌డే అవ‌కాశం ఇచ్చిన కేసు కూడా ఇదే. అస‌లు మొత్తంగా చూస్తే... కోర్టు బోనులో నిల‌బ‌డితే చంద్ర‌బాబును దోషిగా తేల‌డం ఖాయ‌మేన‌ని విశ్లేష‌కులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ వాదిస్తున్న కేసు కూడా ఇదే.  అప్ప‌టిదాకా కేంద్రం వ‌ద్ద త‌న‌దైన శైలిలో వాద‌న‌లు వినిపించిన చంద్ర‌బాబు.. ఈ కేసు న‌మోదైన త‌ర్వాత త‌న వాయిస్‌ ను అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గించ‌క త‌ప్ప‌లేదు. అంతేకాకుండా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో - క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ ఏపీ హ‌క్కుల‌ను చంద్ర‌బాబు కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్ట‌డానికి కార‌ణం కూడా ఈ కేసేన‌న్న విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు. మొత్తంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన చంద్ర‌బాబును అడ్డంగా బుక్ చేసేసింది ఈ  కేసే.  

అస‌లు ఈ కేసు ఏమిటి?... ఇందులో చంద్ర‌బాబు పాత్ర ఏమిటి? అన్న విష‌యాల‌కు వ‌స్తే...  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్ స‌న్ ఓటును కొనుగోలు చేసేందుకు య‌త్నించిన ఈ కేసులో చంద్రబాబు నిజంగానే అడ్డంగా బుక్కైపోయారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అభ్య‌ర్థికి ఓటేస్తే ఏకంగా రూ.5 కోట్లు ఇస్తామ‌ని, మిగ‌తా విష‌యాల్లోనూ మ‌రింత ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు త‌న  దూత‌గా నాడు తెలంగాణ అసెంబ్లీ టీడీఎల్పీ నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డిని నేరుగా స్టీఫెన్‌ స‌న్ ఇంటికి పంపారు. అంతేనా... రేవంత్ రెడ్డి వెంట ఓ అర‌కోటి హార్డ్ క్యాష్‌ ను కూడా చంద్ర‌బాబు ఓ బ్యాగులో స‌ర్దేసి పంపారు. అయితే అప్ప‌టికే అల‌ర్ట్ అయిన తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. ఏసీబీని రంగంలోకి దించేశారు. కేసీఆర్ ఆదేశాల‌తో ప‌క్కా స్కెచ్ వేసిన ఏసీబీ... రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకోవ‌డంతో పాటుగా చంద్ర‌బాబు పాత్ర‌కు సంబంధించి కూడా ప‌క్కా ఆధారాలు సేక‌రించేందుకు గానూ... స్టీఫెన్‌ స‌న్ ఇంటి నుంచి రేవంత్ రెడ్డి... చంద్ర‌బాబుకు చేసిన ఫోన్ కాల్‌ ను కూడా ట్యాప్ చేసేసింది.

ఇవేమీ తెలియ‌ని చంద్ర‌బాబు... స్టీఫెన్‌ స‌న్‌ తో చాలా క్లియ‌ర్‌ గానే త‌న భావ‌న‌ను వెల్ల‌డించారు. *మాకు స‌హ‌క‌రిస్తే... అన్నీ మేమే చూసుకుంటాం బ్ర‌ద‌ర్‌. భ‌విష్య‌త్తులో మీకేమీ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్య‌త కూడా మాదే*న‌ని కూడా చంద్ర‌బాబు చెప్పేశారు. ఇక అన్ని ఆధారాలు దొరికిపోయాయ‌ని భావించిన తెలంగాణ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అర‌కోటి హార్డ్ క్యాష్‌ తో పాటుగా చంద్ర‌బాబు ఫోన్ వాయిస్‌ ను కూడా ప‌ట్టేసి... రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేశారు. కోర్టులో దాఖ‌లు చేసిన చార్జిషీట్లోనూ చంద్ర‌బాబు పేరును చేర్చేసింది. ఆ త‌ర్వాత ఉన్న‌ప‌ళంగా హైద‌రాబాదును వ‌దిలేసిన చంద్ర‌బాబు... అప్ప‌టిక‌ప్పుడు స‌రైన వ‌స‌తి లేకున్నా కూడా... విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ అయిపోయారు. ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న ఈ కేసును తెలంగాణ స‌ర్కారు అంత ఈజీగా ఎందుకు వ‌దిలిపెట్టింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... తప్పు చేసే రాజ‌కీయ నేత‌ల‌ను ప్ర‌శ్నించ‌డంతో పాటు ప్ర‌జ‌ల ప‌క్షాల నిల‌బ‌డేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ కేసుపై ఇప్ప‌టిదాకా నోరెత్తిన దాఖ‌లానే లేదు.

అయితే నిన్న తాను ఇక పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశానంటూ ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... ఈ కేసుపై కూడా నోరు విప్ప‌క త‌ప్ప‌లేదు. నిన్న క‌రీంన‌గ‌ర్‌ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ ఈ కేసుపై నోరు విప్పారు.  ఓటుకు నోటు కేసుపై మీ అభిప్రాయం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు కాస్తంత సూటిగానే స్పందించిన ప‌వ‌న్‌... ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబుది త‌ప్పేన‌ని దాదాపుగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. మ‌రి త‌ప్పు చేసిన రాజ‌కీయ నేత‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌న్న మీడియా ప్ర‌శ్న ఎదురు కాక‌ముందే మేల్కొన్న ప‌వ‌న్‌... తాను ఈ కేసుపై ఇప్ప‌టిదాకా స్పందించ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని కూడా తేల్చి చెప్పారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత క‌ష్టాల క‌డ‌లిలో ప్ర‌యాణం ప్రారంభించిన ఏపీలో రాజ‌కీయ  అస్థిత‌ర ఏర్ప‌డ‌కూడ‌ద‌న్న భావ‌న‌తోనే ఈ కేసుపై తాను ఇప్ప‌టిదాకా నోరు విప్ప‌లేద‌ని ప‌వ‌న్ చెప్పారు. అయినా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌న్న ప‌వ‌న్‌... అస‌లు తాను మాత్ర‌మే స్పందిస్తే... ఏపీలో రాజ‌కీయ అస్థిర‌త ఎందుకు ఏర్ప‌డుతుంద‌న్న భావ‌న‌కు ఎలా వ‌చ్చార‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు జ‌నం మ‌దిలో మెద‌లుతున్నాయి. మొత్తంగా చంద్ర‌బాబును ప‌వ‌న్ కూడా దోషిగానే చూశార‌న్న మాట‌. మ‌రి దోషిగా ఉన్న చంద్ర‌బాబుతో తాను స‌ఖ్య‌తగా కొన‌సాగుతూ ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు ఏం మెసేజ్ ఇస్తున్నార‌న్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది. ఈ ప్ర‌శ్న‌... ప‌వ‌న్‌ను భ‌విష్య‌త్తులో ఏ మేర ఇబ్బంది పెడుతుందో చూడాలి.