Begin typing your search above and press return to search.

ముక్క‌ల చెక్క‌ల‌పైనా మ‌ళ్లీ మాట్లాడిన ప‌వ‌న్

By:  Tupaki Desk   |   1 Jun 2018 6:30 AM GMT
ముక్క‌ల చెక్క‌ల‌పైనా మ‌ళ్లీ మాట్లాడిన ప‌వ‌న్
X
క‌లిసి ఉందామ‌నుకునేటోళ్లు.. విడిపోవ‌టం గురించి మాట్లాడుకుంటే ఎంత త‌ప్పో.. విభ‌జ‌న గాయాల‌తో వేద‌న చెందుతున్న ఏపీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర అదే ప‌నిగా మ‌రోసారి విభ‌జ‌న ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టం అంతే త‌ప్పు. ఎంత‌సేప‌టికి త‌ప్పు చేశాం.. త‌ప్పు చేశామ‌న్న‌ట్లు కించ‌ప‌ర్చుకునే త‌త్త్వాన్ని స్వార్థ రాజ‌కీయాల కోసం తెర మీద‌కు తీసుకురావ‌టం దుర్మార్గ‌మే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు అలాంటి ప‌నే చేస్తున్నారు.

తెలిసి చేస్తున్నారో.. తెలియ‌క చేస్తున్నారో కానీ.. ఈ మ‌ధ్య‌న అదే ప‌నిగా ఏపీ మూడు ముక్క‌లు అయ్యే ప్ర‌మాదం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. ఏపీ నాయ‌కుల్లో లేనిది.. తెలంగాణ నాయ‌కుల్లో ఉన్న తేడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. రాష్ట్ర విభ‌జ‌న నేరం మొత్తం ఆంధ్రా ప్రాంత పాల‌కుల మీద వేసే తెలంగాణ నాయ‌కులు.. త‌మ త‌ప్పేం లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌తారు.

ప్ర‌త్యేక రాష్ట్రం కోసం అంత‌లా పోరాడిన కేసీఆర్ సైతం.. గ‌తంలో స‌మైక్యం మీద అసెంబ్లీలో ఎలా మాట్లాడ‌ర‌న్న దానికి సాక్ష్యంగా వీడియోలు యూట్యూబ్‌ లో ఉన్నాయి. గ‌తంలో తాము మాట్లాడిన మాట‌ల్ని.. అవ‌స‌రం కోసం మార్చేస్తే .. వేలెత్తి చూపించే తెలంగాణ నాయ‌కుడు క‌నిపించ‌రు.

ఎక్క‌డి దాకానో ఎందుకు.. స‌మైక్య పాల‌న‌లో ప‌దవుల పంప‌కం కోస్తా.. సీమ‌.. తెలంగాణ అంటూ లెక్క‌లు వేసుకొని పంచేవారు. తెలంగాణ రాష్ట్రంలో ప‌ద‌వుల పంప‌కాన్ని కేసీఆర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చేస్తున్నారే త‌ప్పించి.. ఉత్త‌ర తెలంగాణ‌.. ద‌క్షిణ తెలంగాణ అంటూ ముక్క‌లుగా చేసుకొని.. ప్రాంతాల వారీగా ప‌ద‌వుల పందేరం చేస్తున్నారా? అన్న‌ది చూస్తే లేద‌న్న విష‌యం క‌నిపిస్తుంది. ముక్క‌లుగా ఆలోచిస్తే ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో.. అలాంటివేమీ లేకుండా అంతా ఒక్క‌టే అన్న‌ట్లుగా ఆలోచిస్తే.. అందుకు త‌గ్గ ఆలోచ‌న‌లే వ‌స్తాయి.

మ‌రి.. ప్రాంతాల మ‌ధ్య స‌మ‌తుల్యం లేదంటూ విభ‌జ‌న గ‌ళాన్ని విప్పిన కేసీఆర్‌.. త‌న పాల‌న‌లో తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్ని ఒకేలా పాలిస్తున్నారా? నిధుల కేటాయింపుల విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే లేద‌నే చెబుతారు.

మ‌రి.. అలాంట‌ప్పుడు తెలంగాణ కూడా భ‌విష్య‌త్తులో రెండు ముక్క‌లు అవుతుంద‌న్న మాట ఎందుకు వినిపించ‌దు? ఆ మాట‌ను మాట్లాడే సాహ‌సం నేత‌లు ఎందుకు చేయ‌రంటే.. క‌లిసి ఉందామ‌న్న ఆలోచ‌నే కార‌ణంగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలాంటి మైండ్ సెట్ ఏపీ నేత‌ల్లో క‌నిపించ‌దు. ఎంత‌సేప‌టికి త‌మ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం విడిపోవ‌టం మీద‌నే ఆలోచించే తీరు వారి మాట‌ల్లోనూ చేత‌ల్లోనూ క‌నిపిస్తుంటుంది.

భిన్న త‌ర‌హాలో రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పే ప‌వ‌న్ తీరునే చూస్తే.. తాజాగా ఆయ‌న చేప‌ట్టిన పోరాట యాత్ర‌లో అదే ప‌నిగా ఏపీ మూడుముక్క‌లు అయ్యే మాట‌నే ప్ర‌స్తావిస్తున్నారు. విభ‌జ‌న గాయాల నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌ని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో తాము నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్నామ‌న్న భావ‌న‌.. దానికి విరుగుడుగా విడిపోవ‌ట‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌లు ఏ మాత్రం మంచివి కావు. కానీ.. అదేమీ ఆలోచించ‌నట్లుగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఉంటున్నాయి.

పాల‌న‌లో త‌ప్పులు ఉంటే ఎత్తి చూపించాలే త‌ప్పించి.. విడిపోయే ప్ర‌మాదం ఉందంటూ కొత్త ఆలోచ‌న‌ల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం ఏపీ భ‌విష్య‌త్తుకు మంచిది కాదు. రేపొద్దున ప‌వ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌నే అనుకుందాం. ఆయ‌న పాల‌న‌లో త‌ప్పులు దొర్ల‌వా? త‌ప్పులు దొర్లితే.. వాటిని అధిగ‌మించేలా ఉండాలే త‌ప్పించి.. త‌ప్పుల‌కు విడిపోయే ప్ర‌మాదం ఉంది సుమా అన్న‌ట్లు మాట్లాడ‌టం మంచిది కాదు. ఈ నేప‌థ్యంలో ఏపీ మూడు ముక్క‌ల‌య్యే ప్ర‌మాదం మీద ప‌వ‌న్ ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.