Begin typing your search above and press return to search.

బాబు దువ్వినా.. పవన్ పై పనిచేయలేదు!

By:  Tupaki Desk   |   16 Feb 2018 9:14 AM GMT
బాబు దువ్వినా.. పవన్ పై పనిచేయలేదు!
X
ఒక ఉద్యమం, ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు.. దాన్ని సాంతం తొక్కేయాలి.. నేలమట్టంగా అణిచేయాలి.. ఇదీ రాజకీయ నాయకులకు తెలిసిన సూత్రం.

కానీ అణిచివేయడం సాధ్యం కానప్పుడు.. తమ శక్తి సామర్థ్యాలకంటె ఉద్యమ ప్రయత్నం ‘లార్జర్’ సైజులో ఉన్నప్పుడు ఏం చేయాలి? దాని క్రెడిబిలిటీని దెబ్బతీయాలి! ఆ ఉద్యమ ప్రయత్నం మీద బురద చల్లాలి. దానికి ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేయాలి. –ఇదీ, నాయకులు అనుసరించే వక్రవ్యూహం.

కానీ, తాము బురద చల్లడానికి కూడా అందనంత ‘లార్జెస్ట్’సైజుల్లో ఒక ఉద్యమ ప్రయత్నం ఉంటే గనుక.. అప్పుడేం చేయాలి.. వారి ప్రయత్నం మనకు అనుకూలమే అంటూ ముందే టముకు వేసుకోవాలి. మనకోసమే వారు ఉద్యమం చేస్తున్నారు.. వాళ్లు మనోళ్లే అంటూ.. తమ ఇమేజి నీడలోకి వారిని తీసుకురావడానికి ఒక పాచిక వేయాలి. ఇది అచ్చంగా చంద్రబాబు మార్క్, అత్యాధునిక హైటెక్ రియల్ టైమ్ తెలివితేటల టెక్నిక్.

చంద్రబాబునాయుడు అదే మైండ్ గేమ్ ను ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ దాదాపుగా రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీల ప్రతినిధులు, రాష్ట్రం కోసం మాట్లాడుతున్న కొందరు మేధావులను పోగుచేసి.. జెఎఫ్‌సి రూపంలో సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు- తగాదాకు కారణమైన లెక్కలు తమకిస్తే.. నిగ్గుతేలుస్తాం.. అని పవన్ కల్యాణ్ కోరితే.. ఎన్నికల సమయాన్ని ఆయన మద్దతును పుష్కలంగా వాడుకున్న ఇరు ప్రభుత్వాలూ తూచ్ అనేశాయి. వెబ్ సైట్లలో వెతుక్కోండి అనేశాయి.. (ఇంకానయం గూగుల్ లో వెతుక్కోమని చెప్పలేదు)

చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి.. పవన్ మనోడే.. ఆ జెఎఫ్‌సి మనకేం ఇబ్బంది లేదు అని ఒక సంకేతం ఇచ్చేసి.. పవన్ ప్రయత్నపు క్రెడిబిలిటీని తన సొంతం చేసేసుకున్నారు. కాపోతే.. కాంగ్రెస్ ను ఆహ్వానించినందుకు మాత్రం మండిపడ్డారు. ఈ రెండు పనులూ పవన్ కు కిట్టనట్టుంది. కానీ.. అప్పుడే తన జోరు చూపించకుండా.. ఇంకా చంద్రబాబు మీద ప్రత్యక్ష పోరాటాన్ని ప్రకటించలేదన్నట్టుగా పవన్ కూడా.. ఇక్కడేమీ కౌగిలింతలకు పిలవలేదు కదా.. రాష్ట్రం గురించి చర్చించడానికే పిలిచాం.. విభజనలో తప్పో ఒప్పో వారికీ బాధ్యత ఉంది గనుక పిలిచాం.. అంటూ రిటార్టు ఇచ్చారు. మీరు వస్తే వద్దన్నామా.. రాకుండా తప్పించుకు తిరుగుతున్నది మీరే కదా.. అని సూటిగా అనకపోయినా.. పిలిచినా తెదేపా, వైసీపీ రాదలచుకోలేదని చెప్పారు.

తెదేపా నేతలూ.. మళ్లీ కౌంటర్లకు మీరు రెడీ కావొద్దు.. పవన్ మీ మిత్రుడు సంయమనం అవసరం.. బాబు క్లాస్ తీసుకుంటాడు జాగ్రత్త!