Begin typing your search above and press return to search.

ఉన్న కూసింత పరువు తీసుకుంటారెందుకు పవన్?

By:  Tupaki Desk   |   21 Nov 2019 6:09 AM GMT
ఉన్న కూసింత పరువు తీసుకుంటారెందుకు పవన్?
X
రాజకీయాల్లో హత్యలు ఉండవు. అన్ని ఆత్మహత్యలే అన్న మాటకు తగ్గట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఉంటుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేద్దామనుకునే వారు పక్కా వ్యూహంతో అడుగులు వేయాలే తప్పించి.. ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తే అభాసుపాలు కావటం తథ్యం. ప్రస్తుతం జనసేనాని తీరు ఇందుకు తగ్గట్లే ఉందన్న విమర్శలు ఉన్నాయి.

జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ పవన్ పొలిటికల్ కెరీర్ ను చూస్తే.. నిలకడలేని మాటలు.. వ్యూహం లేని వైనంతో తనకున్న ఇమేజ్ ను అంతకంతకూ తగ్గించుకుంటూ వస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయాల మీద ఫోకస్ పెడతానని చెబుతూనే.. తన ప్రాధాన్యత ఏపీ అన్న విషయాన్ని తన చేతలతో ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అంశాల మీద అప్పుడప్పుడు స్పందిస్తూ.. తానొకడు ఉన్నాడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

సీరియస్ రాజకీయాల్ని చేయని వారిని లైట్ తీసుకుంటారన్న విషయాన్ని పవన్ మర్చిపోతున్నారు. అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతను మరుస్తున్న ఆయన.. తనకు లేని పవర్ తనకుందన్నట్లుగా వ్యవహరించిన ఆయన తీరుకు ఇప్పటికే రెండుమూడుసార్లు గాలి తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఉత్సాహంతో వ్యాఖ్య చేసిన పవన్ కు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం కలిసేందుకు సైతం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఏదో చేస్తానన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన పవన్ ఏమీ చేయలేరన్న విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కేసీఆర్ కు జనసేనాని ట్వీట్ తో విజ్ఞప్తి చేయటం చూస్తే కామెడీగా అనిపించక మానదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను వ్యూహాత్మకంగా దెబ్బ తీసిన కేసీఆర్.. రాష్ట్రంలో తన మాట కాదని పోరుబాట పట్టేవారికి చుక్కలు చూపించాలని డిసైడ్ అయిన నేపథ్యంలో.. సమ్మెతో తేల్చుకుంటామన్న వారికి.. అయ్యా.. బాబు.. దయచేసి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోండన్న వరకు తీసుకొచ్చిన కేసీఆర్.. పవన్ ట్వీట్ వినతికి సానుకూలంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

న్యాయబద్ధమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న వారికి మేలు కలిగేలా చేయటంలో విఫలమైన పవన్.. ఇప్పుడు తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలన్న ట్వీట్ చేయటం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని.. కేసీఆర్ ను ఢీ కొనే విషయంలో తమ సత్తా సరిపోదన్న విషయాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు చప్పుడు చేయకుండా ఉండిపోయాయి. ఇలాంటివేళ.. తనకున్న కొద్దిపాటి ఇమేజ్ సైతం పోగొట్టుకునేలా ట్వీట్లు చేయటం ఎందుకన్నది ప్రశ్నగా మారింది.

ఇప్పుడు పవన్ ట్వీట్ చేసిన వెంటనే కేసీఆర్ స్పందించేది ఉండదు. అలాంటప్పుడు ఆయన ట్వీట్లకు ఎలాంటి ఫలితం లేదన్న విషయం తేలిపోవటమే కాదు.. ఆయన ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నరన్నది అర్థమవుతుంది. కాగితం పులి అన్నట్లుగా ట్వీట్లతో హడావుడి చేయటమే కానీ.. వ్యవస్థలో ఏ స్థానంలో ఉన్న వారిని సైతం పవన్ కదిలించలేరన్నది ఒకటికి నాలుగుసార్లు స్పష్టమైన తర్వాత.. ప్రజలు సైతం ఆయన వెంట ఉండేందుకు ఇష్టపడరన్న వైనాన్ని పవన్ మర్చిపోతున్నారు. రాజకీయ అధినేతలు ఎవరైనా సరే.. తమ నోటి నుంచి వచ్చే మాటలతో ప్రకంపనలు కలిగేలా చేయాలే తప్పించి.. ఏదో మాట్లాడామంటే మాట్లాడామన్నట్లుగా ఉంటే ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పవన్ ఎప్పటికి గుర్తిస్తారు?