Begin typing your search above and press return to search.

వైకాపా డిమాండ్ కే పవన్ కల్యాణ్ జైకొట్టారా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 4:09 AM GMT
వైకాపా డిమాండ్ కే పవన్ కల్యాణ్ జైకొట్టారా?
X
పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు ఏం జరుగుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎందుకు అంత రహస్యంగా ప్రవర్తిస్తోంది. కేంద్రం ఎందుకు చంద్రబాబునాయుడు సర్కారు ను అనుమానంగా చూస్తోంది? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలినుంచి ఇప్పటిదాకా జరుగుతున్నది ఏమిటో ప్రజలకు తెలియజెప్పడానికి చంద్రబాబునాయుడు చాలా విముఖంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన సంగతే. దానికి సంబంధించి.. ఏం అడిగినా సరే.. ఆయన ఆగ్రహంతో దాటవేస్తారు. తాను పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని పడికట్టు ప్రసంగాలు చేయడం తప్ప.. అక్కడ ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పడానికి ఆయన ఇష్టపడరు. ఇలాంటి నేపథ్యంలో.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రాజెక్టు పనులను పరిశీలించిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కూడా అచ్చంగా అదే డిమాండ్ ను వినిపిస్తున్నారు.

జగన్ అంటే నాకు ఇష్టం లేదు అని పవన్ కల్యాణ్ 24 గంటల కిందట ప్రకటించి ఉండవచ్చు గాక.. అలాగే తాను ఏ పార్టీకి దగ్గర గానీ - దూరంగానీ కాదని చెప్పిన సంగతిని కూడా గుర్తు చేసుకోవాలి. తన ఎజెండా ప్రజలకు అనుకూలంగా మాత్రమే ఉంటుందని పదేపదే చెబుతూ ఉండే పవన్ కల్యాణ్ .. అదే ధోరణితో అచ్చంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో, శ్వేతపత్రం విడుదల చేయాలని కోరడం ఆహ్వానించదగ్గ పరిణామం అనే చెప్పాలి. ప్రభుత్వం తమ మీద రేకెత్తుతున్న అనేక సందేహాలను నివృత్తి చేయాలంటే ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్లుగా దాపరికం లేకుండా ప్రజల ముందు పెట్టాలి.

పోలవరం విషయంలో డ్రామాలు ఆడుతున్న చంద్రబాబునాయుడు ప్రతిపక్షాల డిమాండ్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారనే విమర్శలు ప్రజలనుంచి తరచూ వినిపిస్తుంటాయి. పోలవరం అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడం ఒక్కటే మార్గం అని, జరుగుతున్న ఖర్చులు పనుల గురించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉన్నదని గతంలోనూ ప్రతిపక్షాలు చాలా సార్లు ప్రస్తావించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఈ డిమాండ్లు పలుమార్లు వచ్చాయి. కాంగ్రెస్ కూడా ఇవే డిమాండ్లను వినిపిస్తూంది. అలాగే.. ఇటీవల కూడా కేంద్రం పోలవరం వైఖరి మారిన తర్వాత కూడా వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ శ్వేతపత్రం విడుదల గురించి ప్రస్తావించారు.

తాజాగా ఇప్పుడు అదే వరుసలో పవన్ కల్యాణ్ కూడా జాయిన్ అయ్యారు. ఇన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ వినిపిస్తున్న డిమాండ్ కే ఇప్పుడు పవన్ జై కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం తైనాతీలు తప్ప.. ప్రతి ఒక్కరూ.. శ్వేతపత్రం డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సహా! మరి ఇప్పుడైనా చంద్రబాబునాయుడు తన ఒంటెత్తు పోకడలు మానుకుని.. శ్వేతపత్రం తెస్తారేమో చూడాలి.