Begin typing your search above and press return to search.

కేసీఆర్‌.. ప‌వ‌న్ ల మ‌ధ్య అన్ని మాట‌లేంది?

By:  Tupaki Desk   |   25 Dec 2017 4:35 AM GMT
కేసీఆర్‌.. ప‌వ‌న్ ల మ‌ధ్య అన్ని మాట‌లేంది?
X
ఆ.. ఎవ‌రాయ‌న‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్‌ స్టార్ గా సుప‌రిచితుడైన ప్ర‌ముఖుడి గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేసే వ్యాఖ్య‌. ఒక్క‌సారే కాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌స్తావించిన ప్ర‌తిసారీ ప‌వ‌న్‌ ను చిన్న‌బుచ్చేలా మాట్లాడ‌టం.. తేలిగ్గా తీసి పారేయ‌టం కేసీఆర్‌ కు అల‌వాటే.

అదేస‌మ‌యంలో.. త‌న‌ను చిన్న‌బుచ్చే కేసీఆర్‌ ను ఉద్దేశించి డైరెక్ట్ అటాక్ చేయ‌కుండా.. న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేయ‌టం ప‌వ‌న్ లో క‌నిపిస్తుంది. ఇక‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే.. వీరి మ‌ధ్య ఘాటు విమ‌ర్శ‌లే న‌డిచాయి. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన‌ప్పుడు తాను ఎంత‌గా వేద‌న చెందానో ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పుకున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఇలా ఇరువురి మ‌ధ్య‌.. ఏ మాత్రం స‌త్ సంబంధాలు లేవ‌న్న వాద‌న వినిపిస్తున్న వేళ‌.. ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. రాష్ట్రప‌తి శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు విందును ఏర్పాటు చేశారు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌. ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతో స‌హా పెద్ద ఎత్తున రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ విందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కావ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న‌తో కేసీఆర్ కాసేపు ముచ్చ‌టించుకోవ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వీరిద్ద‌రూ ఒంట‌రిగా ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవ‌టం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఈ ఇద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

విభ‌జ‌న స‌మ‌యంలో వీరి ఇరువురి మ‌ధ్య విమ‌ర్శ‌లు ఏ స్థాయిలో సాగాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జ‌న‌సేన పార్టీని స్థాపించిన సంద‌ర్భంగా కేసీఆర్ కుమార్తె క‌విత‌ను ఉద్దేశించి.. ఆమె న‌డిపే జాగృతి సంస్థ లెక్క‌ల్ని ప‌వ‌న్ అడ‌గ‌టం మ‌ర్చిపోకూడ‌దు. దీనికి క‌విత తీవ్రంగా రియాక్ట్ కావ‌టం ఒక ఎత్తు అయితే.. ప‌వ‌న్ ను ఉద్దేశించి కామెడీ చేసేలా కేసీఆర్ మాట్లాడ‌టం గ‌తంగా వ‌దిలేస్తే.. ఈ మ‌ధ్య‌నే ఏపీలో ఏ పార్టీ బ‌లం ఎంత‌న్న ముచ్్చ‌ట చెప్పే క్ర‌మంలో జ‌న‌సేన‌కు ఒక‌శాతం ఓట్లు కూడా రావ‌న్న వ్యాఖ్య చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

త‌న పార్టీకి ఒక శాతం ఓట్లు రావ‌న్న కేసీఆర్ వ్యాఖ్య‌కు.. న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స‌త్ సంబంధాలు లేన‌ప్ప‌టికీ.. విందులో మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్‌.. ప‌వ‌న్ లు మాట్లాడుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. మ‌రి.. వీరి మ‌ధ్య న‌డిచిన మాట‌లు బ‌య‌ట‌కు రావా? అంటే.. ఒకే ఒక్క అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. ఇలాంటి ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట్ల‌ను అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు బ‌య‌ట‌పెడుతుంటారు కేసీఆర్‌. అలాంటిదేదైనా సంద‌ర్భంలో మాత్ర‌మే ఈ ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.