Begin typing your search above and press return to search.

బాబు సర్కార్ వి అబద్ధాలే : పవన్ దాడి షురూ!

By:  Tupaki Desk   |   7 Feb 2018 12:04 PM GMT
బాబు సర్కార్ వి అబద్ధాలే : పవన్ దాడి షురూ!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని.. ప్రజలను మభ్యపుచ్చుతున్నదని.. తనను కూడా తప్పుదారి పట్టించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రత్యేకహోదా గురించి గానీ - ప్రత్యేక ప్యాకేజీ గురించి గానీ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులేమిటి - వస్తున్న నిధులు ఎంత.. ఎంత మేర అన్యాయం జరుగుతోంది.. అసలు కేంద్రం నుంచి వచ్చిన నిధులను వెచ్చించడం అనేది ఎంత పద్ధతిగా జరుగుతోంది... ఇలాంటి విషయాల్లో ఎవ్వరూ నిజాలు చెప్పడంలేదని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబునాయుడు తనను ఎలా డైవర్ట్ చేశారో.. పవన్ కల్యాణ్ చాలా విపులంగా చెప్పారు.

ప్రత్యేకహోదా విషయంలో పదేళ్లపాటూ ఇస్తాం అంటూ భాజపా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన తర్వాత.. తాను వరికి మద్దతు ఇచ్చి గత ఎన్నికల్లో పనిచేశానని ఆయన చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏడాది పాటూ వేచిచూశానని.. ఏడాదిన్నర తర్వాత.. వారు ప్రత్యేకహోదా విషయంలో మోసం చేస్తున్నారని అనిపించి.. తిరుపతి సభ తో ప్రారంభించి క్రియాశీల పోరాటం ప్రారంభించాలని అనుకున్నానని చెప్పారు. కాకినాడ సభ తర్వాత.. హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లదలచుకున్నాను గానీ.. ఈలోగా ప్యాకేజీ ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తనతో.. ఈ ప్యాకేజీ చాలా అద్భుతం అని... దీని ద్వారా చాలా ఎదుగుతాం అని చెప్పడం వల్ల.. తాను చల్లారిపోయానని పవన్ స్వయంగా ఒప్పుకున్నారు. ఇవే కాకుండా చాలా వివరాలు అడిగినప్పుడు.. రాష్ట్రప్రభుత్వ అధికారులు చెబుతున్న గణాంకాలు - వివరాలు కూడా అర్థసత్యాలుగా - అసత్యాలుగా ఉంటున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు మేధావులతో ఓ జేఏసీ పనిచేసినట్లుగా.. తాను కూడా కొందరు మేధావులు - తటస్థ నాయకులతో కలిసి జేఏసీ వంటి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. ఉండవిల్లి అరుణ్ కుమార్ - జయప్రకాశ్ నారాయణ్ వంటి వారు ఇందులో ఉంటారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. చిరంజీవి ఇందులో ఉండరని కూడా ఆయన చెప్పారు.

మొన్నమొన్నటి దాకా చంద్రబాబునాయుడుకు ఏకపక్షంగా పవన్ మద్దతిస్తున్నట్లే అందరూ అనుకున్నారు. అయితే.. కేంద్రం రాష్ట్రంలోని రెండు ప్రభుత్వాలూ అబద్ధాలే చెబుతున్నాయని.. ఏవి నిజాలో.. అసలైన అన్యాయం ఎక్కడ ఏ రూపంలో జరుగుతున్నదో నిగ్గు తేల్చడానికే.. ఈ ప్రభుత్వాల మభ్యపుచ్చే ప్రయత్నాలకు చెక్ పెట్టడానికే తాను ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ వెల్లడించడం విశేషం. ఆయన చంద్రబాబు సర్కార్ మీద తొలిసారిగా ప్రత్యక్ష విమర్శల దాడికి పూనుకున్నట్లుగా కనిపిస్తోంది.