Begin typing your search above and press return to search.

బాబు జ‌ల్లిక‌ట్టు ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ ట్వీట్ జ‌ల్లెకాయ‌

By:  Tupaki Desk   |   25 Jan 2017 10:33 AM GMT
బాబు జ‌ల్లిక‌ట్టు ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ ట్వీట్ జ‌ల్లెకాయ‌
X
మాట‌కు మాట అన్న‌ట్లుగా ట్వీట్ తో తాను చెప్పాల‌నుకుంటున్న‌ది సూటిగా చెప్పేస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌. గ‌డిచిన నాలుగు రోజులుగా ట్వీట్ల జోరును విప‌రీతంగా పెంచేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎవ‌రేం అన్నా వెనువెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. ఎదుటోళ్ల నోటి నుంచి మ‌ళ్లీ మాట రాకుండా ఆయ‌న స‌మాధానం చెప్పేస్తున్నారు. గ‌తంతో కంటే మ‌రింత సూటిగా..నిక్క‌చ్చిగా.. అన్నింటికి మించి మ‌రింత క‌ర‌కుగా ఆయ‌న మాట‌లు ఉంటున్నాయి.

ఆంధ్రుల ఆకాంక్ష‌లు మిన‌హా.. మ‌రింకేమీ త‌న‌కు ప‌ట్ట‌వ‌న్న‌ట్లు.. ఎవ‌రైనా స‌రే.. వారెంత ఉన్న‌స్థానాల్లో ఉన్నా.. వారికెంత ప‌వ‌ర్ ఉన్నా త‌న‌కేమీ ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉంటున్నాయి. మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు చేసిన విమ‌ర్శ‌పై ఘాటుగా రియాక్ట్ అయిన ఆయ‌న‌.. మ‌ళ్లీ ఆయ‌న నోటి నుంచి మాట రాన‌ట్లుగా ట్వీట్ తో గ‌డ్డి పెట్టినంత ప‌ని చేశారు.

ఈ రోజు మ‌ళ్లీ త‌న ట్వీట్లను షురూ చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా.. కేంద్రంపైనా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రెండు రోజుల క్రితం జ‌ల్లిక‌ట్టుకు.. ఏపీ హోదాకు సంబంధం ఏమిటంటూ వేసిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ సూటిగా స‌మాధానం చెప్ప‌ట‌మే కాదు.. త‌న స‌మాధానంతో బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశార‌ని చెప్పాలి.

ఈ రోజు పోస్ట్ చేసిన మొదటి పోస్ట్ లో.. ఆంధ్రులు ఈ దేశ ప్ర‌జ‌ల‌ని.. కేంద్రంలోని నాయ‌కుల‌కు..పార్టీల‌కు బానిస‌లు కాద‌ని పేర్కొన్నారు. ప‌ద‌వులు కోరుకునే వారు.. వ్య‌క్తిగ‌త వ్యాపార అవ‌స‌రాలున్న వ్య‌క్తులు.. నాయ‌కులు.. జీ హుజూర్ అని వంగి వంగి స‌లాములు చేయ‌టం చూసి ఆంధ్రులు మీ బానిస‌లని పొర‌పాటు ప‌డొద్దంటూ ప్ర‌ధాని మోడీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. జ‌ల్లిక‌ట్టుకు.. హోదాకు సంబంధం ఏమిటంటూ వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఒక సంప్ర‌దాయం కోసం త‌మిళులు అంత‌గా పోరాటం చేసిన‌ప్పుడు.. మ‌న అవ‌స‌రాల కోసం మ‌రెంత‌గా పోరాటం చేయాలి? ఆ జ‌ల్లిక‌ట్టు పోరాట స్ఫూర్తితో యువ‌త వ‌స్తున్న‌ప్పుడు.. కుదిరితే స‌హ‌క‌రించండి.. అంతేకాని వెన‌క్కి లాగే ప్ర‌య‌త్నం చేయ‌కండి అంటూ ఘాటుగా బ‌దులిచ్చారు. లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్ అన్న‌ట్లు.. బాబుకు అదిరిపోయే పంచ్ లాంటి ట్వీట్ చేసిన ప‌వ‌న్‌.. అమ్మ పెట్ట‌దు.. అడుక్కు తిన‌నివ్వ‌దు అన్న సామెత‌లాగా ఉంది ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ కి మీరు పోరాటం చేయ‌రు.. చేసేవాళ్ల‌ను చేయ‌నివ్వ‌రు. మ‌రి ఎలా? అంటూ ముగించారు.