Begin typing your search above and press return to search.

రెండు చోట్ల పోటీ!... పీకే లెక్క చెప్పేశార‌బ్బా!

By:  Tupaki Desk   |   5 April 2019 4:06 AM GMT
రెండు చోట్ల పోటీ!... పీకే లెక్క చెప్పేశార‌బ్బా!
X
ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ అంటేనే... ప్ర‌త్యేకం కింద లెక్కే. ఆ ప్ర‌త్యేకం ఏమిట‌న్న విష‌యం జ‌నాల‌కు తెలిసినా... అలా రెండు చోట్ల పోటీపై ఆయా నేత‌లు పెద్ద‌గా నోరిప్పిందే లేద‌నే చెప్పాలి. ఇలా రెండు చోట్ల పోటీ చేసి... రెండు చోట్లా గెలిచి... ఆన‌క ఓ సీటుకు రాజీనామా చేసి... మ‌ళ్లీ అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చేలా చేయ‌డం... ప్ర‌జా ధనాన్ని వృథా చేయ‌డం కాదా? అంటే... వృథా చేయ‌డ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ను గ‌తంలో రెండు చోట్ల పోటీ చేసిన నేత‌ల‌ను ఎవ‌రైనా అడిగారా? అంటే... లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు వారి వ‌ద్ద స‌మాధానం ఉండ‌దు. అలాగ‌ని ఆ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌ను సంధించే అవ‌కాశం ఇటు ప్ర‌జ‌ల‌కే కాకుండా అటు మీడియాకు కూడా ఆ నేత‌లు ఇవ్వ‌రు.

ఇలా గ‌తంలో రెండు సీట్ల‌లో పోటీ చేసిన వారు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు - మాజీ ప్ర‌ధాని - ఉక్కు మ‌హిళ ఇందిరా గాంధీ - ఆమె త‌న‌యుడు - మ‌రో మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ - ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు - టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తారక‌రామారావు - కేంద్ర మాజీ మంత్రి - మెగాస్టార్ చిరంజీవి - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... ఇలా చాలా మంది ఉద్ధండులే ఉన్నారు. వీరిని ఏ ఒక్క‌రు కూడా రెండు చోట్ల పోటీ ఎందుకు బాసూ అంటూ ఎవ‌రూ అడిగిన దాఖ‌లానే లేదు. అయితే ఇప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అలా కాదు క‌దా. సినిమాల్లో నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌... తానో సామాన్యుడినంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రి జ‌నం అడిగే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు ఇవ్వాల్సిందే క‌దా. అందునా మీడియా అడిగే ప్ర‌తి ప్ర‌శ్న‌కు కూడా స‌వివ‌రంగానే స‌మాధానం ఇస్తానంటూ ప్ర‌క‌టిస్తున్నారు క‌దా. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌శ్న ప‌వ‌న్‌ కు ఎదురైంది. అయితే తొలుత పై జాబితాలోని వారి లాగే ప‌వ‌న్ కూడా ఈ ప్ర‌శ్న‌ను స్కిప్ చేస్తూనే వ‌చ్చిన ప‌వ‌న్‌... ఎట్ట‌కేల‌కు స‌మాధానం ఇచ్చేశారు. తాను రెండు చోట్ల పోటీ చేయ‌డం వెనుక చాలా కార‌ణాలున్నాయంటూ ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగానే తాను రెండు చోట్ల పోటీకి దిగుతున్న‌ట్లుగా ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఇక రెండు చోట్లా గెలిస్తే... ఓ స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ప్ర‌జా ధ‌నం వృథానే క‌దా అన్న ప్ర‌శ్న‌కు కూడా ప‌వ‌న్ త‌న‌దైన శైలి ఆన్స‌రిచ్చారు. ప్ర‌స్తుతం సీఎం హోదాలో ఉన్న టీడీపీ అదినేత నారా చంద్ర‌బాబునాయుడు పుష్క‌రాల కోసం చేస్తున్న వృథా - విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ త‌న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన దానితో పోలిస్తే... తాను పోటీ చేసే స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక‌కు అయ్యే ఖ‌ర్చెంత అంటూ ఆయ‌న లాజిక‌ల్ స‌మాదానం ఇచ్చేశారు. మ‌రి ఈ స‌మాధానం ఎంత‌మందిని సంతృప్తిప‌రుస్తుందో చూడాలి.