Begin typing your search above and press return to search.

అనంత బ‌రిలో ప‌వ‌న్ ఎందుకు లేరో చెప్పేసిన ప‌వ‌న్!

By:  Tupaki Desk   |   29 March 2019 5:18 AM GMT
అనంత బ‌రిలో ప‌వ‌న్ ఎందుకు లేరో చెప్పేసిన ప‌వ‌న్!
X
వెనుకా ముందు చూసుకోకుండా మాట‌లు చెప్పేయ‌టం.. ఆ త‌ర్వాత వాటికి వివ‌ర‌ణ ఇవ్వ‌టం కొంద‌రు నేత‌ల‌కు అల‌వాటు. ఈ కోవ‌లోకే వ‌స్తారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. త‌న మ‌న‌సులోని మాట‌ల్ని చెప్పే క్ర‌మంలో చాలానే హామీల్ని ఇచ్చేస్తుంటారు. అనంత నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌టం కావొచ్చు... అనంత అన్న‌దాత క‌ష్టాలు తెలుసుకోవాల‌ని చెప్ప‌టం కావొచ్చు.. అనంత‌లో పాద‌యాత్ర చేయాల‌ని చెప్ప‌టం లాంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పాలి.

తాను వెళ్లిన ప్రాంతాల్లో అప్ప‌టిక‌ప్పుడు త‌న‌కేం అనిపించిందో.. వాట‌న్నింటి సాధ్యాసాధ్యాల్ని ఆలోచించ‌కుండా మాట‌లు చెప్పేయ‌టం.. ఆ త‌ర్వాత విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌టం అల‌వాటే. దాదాపు రెండేళ్ల క్రితం అనంత‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా తాను అనంత‌పురం అర్బ‌న్ బ‌రిలోకి దిగాల‌న్న ఆకాంక్ష‌ను ప‌వ‌న్ వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌కు సానుకూల స్పంద‌న వ‌చ్చింది కూడా.

అనంత‌లో పోటీ చేయ‌టం ద్వారా రాయ‌ల‌సీమ‌లో త‌న‌కున్న బ‌లాన్ని చాటాల‌నుకున్నారు. మ‌రి ఏమైందో ఏమో కానీ.. తాజాగా ఆయ‌న పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో అనంత లేక‌పోవ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది. మ‌రికొంద‌రు.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారు. అనంత‌కు ప‌వ‌న్ హ్యాండిచ్చార‌ని.. పోటీ చేస్తాన‌ని చెప్పి మాట త‌ప్పిన‌ట్లుగా మండిప‌డ్డారు. త‌న‌పై వస్తున్న విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేనాని తాజాగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు అనంత‌లో అభిమానులు ఉన్నా.. ప‌ని చేసే నేత‌లు పెద్ద‌గా లేర‌ని అందుకే తాను పోటీకి దిగ‌లేద‌న్నారు.

ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి అనంత‌లో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని.. పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న‌న మాట‌ను చెప్పారు. అంతేకాదు.. ఎప్ప‌టిమాదిరే అనంత‌పై త‌న‌కున్న అభిమానాన్ని మాట‌ల రూపంలో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు అండ‌గా నిలిచే నాయ‌కులు త‌న ప‌క్క‌న లేర‌ని అందుకే తాను పోటీ చేయ‌టం లేద‌న్న ప‌వ‌న్‌.. జ‌న‌సైనికులు ఉన్నంత అండ‌గా.. నేత‌లు ఉండి ఉంటే బాగుండేద‌న్నారు.

అయితే.. తాను అధికారంలోకి వ‌స్తే మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌నంత అభివృద్ధిని అనంత‌లో చేసి చూపిస్తాన‌ని చెప్పారు. అనంత‌ను ద‌త్త‌త తీసుకొని మ‌రీ మెరుగుప‌రుస్తాన‌న్న మాట ఇచ్చారు. రాయ‌ల‌సీమ క‌రువును ప్ర‌స్తావిస్తూ..అక్క‌డి నుంచి వ‌ల‌స‌ల్ని నిరోధించేలా తాను ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లు వ‌రాల వ‌ర్షం కురిపించారు.