Begin typing your search above and press return to search.

పెద్ద తలకాయలపై కన్నేసిన పవన్

By:  Tupaki Desk   |   7 Feb 2018 4:41 PM GMT
పెద్ద తలకాయలపై కన్నేసిన పవన్
X
నాలుగేళ్లుగా రాజకీయాలను తడుముతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ సినిమా బుర్రలను - ఎవరికీ పరిచయం లేనివారిని మాత్రమే తన వెంట తిప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఆరితేరినవారు - మేధావులు ఎవరూ ఆయనతో లేరు. అయితే, రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఆ లోటును తీర్చుకోనున్నారు. మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్ - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ లతో కలిసి రాజకీయ జేఏసీ ఏర్పాటు చేస్తానన్నారు. అన్నట్లుగానే ఉండవల్లికి ఫోన్ చేసి 11న కలుస్తానని కూడా చెప్పేశారు. అందుకు ఆయన కూడా ఓకే చెప్పేశారు.

పవన్ ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య భేటీకి తేదీ నిర్ణయమైందని.. 11వతేదీన హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ తనకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి పనిచేయాలని పవన్ కోరారని ఉండవల్లి తెలిపారు. ఇవాళ మీడియాతో పవన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కమిటీ వేయనున్నట్లు ప్రకటించారని... . అందులో భాగంగానే తనకు ఫోన్ చేసినట్లు ఉండవల్లి తెలిపారు

11న పవన్ ను కలిశాక తాను స్పందిస్తానని.. ఆయన కార్యాచరణ ఏంటో తెలిశాక మాట్లాడతానని అన్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ రిస్క్ తీసుకున్నారని, రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉందని ఉండవల్లి అప్పుడే సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే, పోరాటం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఏదైనా చేస్తే రాజకీయ పార్టీలే చేయాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

అయితే.. జయప్రకాశ్ నారాయణ్ - ఉండవల్లిలు ఇద్దరి మధ్యా ప్రత్యక్షంగా వైరం లేనప్పటికీ ఇద్దరూ భిన్న ధ్రువాలేనని చెప్పాలి. జయప్రకాశ్ నారాయణ్ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలురు కాగా ఉండవల్లికి చంద్రబాబు పేరు వినిపిస్తే చాలు ఒంటికాలు మీద లేస్తారు. ఇద్దరూ మేధావులే. ఉండవల్లి ఏదైనా పట్టుకున్నారంటే అధ్యయనం చేసి అన్నీ తెలుసుకుని అంతు చూసేవరకు వదిలిపెట్టరన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా మాటకారి. ఆకర్షించేలా మాట్లాగలరు. మరోవైపు జేపీ కూడా విస్తారమైన నాలెడ్జి ఉన్న వ్యక్తే, అయితే.. ఆయన ఉండవల్లిలా అగ్రెసివ్ కాదు. మరి ఈ ఇద్దరినీ పవన్ ఎంతవరకు కలుపుకొని పోగలరో చూడాలి.