Begin typing your search above and press return to search.
ప్రచారం అతి అయితే ఇలా ఉంటుంది లోకేష్
By: Tupaki Desk | 7 Jun 2018 4:29 PM GMTఏపీలో రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సహజంగానేన ప్రభుత్వ పథకాల కేంద్రంగా సైతం ఆయా పార్టీలు హాట్ హాట్ కామెంట్లు సాగుతున్నాయి. ఇలా సాగుతున్న ప్రచారంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేసిన కామెంట్లు కొత్త చర్చకు తెరతీశాయి. తమ కేంద్రంగా టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు జనసేన ఘాటు కౌంటర్ ఇచ్చింది.
విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పాయకరావుపేటకు రానున్న సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు మృతి చెందారు.పవన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు 30 అడుగుల ఫ్లెక్సీని తయారు చేయించారు. సూర్య మహల్ సెంటర్‌లో ఓ బిల్డింగ్ వద్ద ఆ ఫ్లెక్సీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఆ క్రమంలో విద్యుత్‌ఘాతం అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తగలడం వల్లనే వారు మరణించినట్లు సమాచారం. మృతులు పాయకరావుపేటకు చెందిన శివ, తునికి చెందిన నాగరాజుగా గుర్తించారు. మృతులకు చంద్రన్న బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించింది. అయితే దీన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేష్ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇద్దరు అకాల మృత్యువాత పడ్డారని పేర్కొంటూ...వారికి చంద్రన్న బీమా కింద సహాయం అందించామని, పార్టీలకు అతీతంగా జై టీడీపీ అనే నినాదం చేసేందుకు ఇదే తార్కాణం అని ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన వర్గాలు ఘాటుగా స్పందించాయి. చంద్రన్న బీమా గురించి ప్రచారం చేసుకోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. బీమా కింద అందించిన ఈ సొమ్ము చంద్రబాబు జేబు నుంచో...లోకేష్ జేబు నుంచో అందించలేదనే విషయాన్ని గమనించాలని ఘాటు కౌంటర్ వేశారు. దీంతో లోకేష్ ప్రచారం బూమరాంగ్ అయిందని అంటున్నారు.