Begin typing your search above and press return to search.

ప్రాణాల మీద ఆశ‌లొదిలేశా: ప‌వ‌న్

By:  Tupaki Desk   |   30 Sep 2018 10:30 AM GMT
ప్రాణాల మీద ఆశ‌లొదిలేశా: ప‌వ‌న్
X
త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోందంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రవ్యాప్తంగా ఎంత‌గా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయో తెలిసిందే. తాజాగా ఆయ‌న ఈ అంశంపై మ‌రోసారి స్పందించారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉన్న మాట వాస్త‌వ‌మ‌ని.. ప్రాణం మీద ఆశ‌ల‌ను తానెప్పుడో వ‌దిలేసుకున్నాన‌ని అన్నారు. త‌న‌పై దాడి చేసేందుకు చాలామంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జాస్వామ్య‌ - హింసాత్మ‌క పోరాటాల్లో దేనికైనా తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఆ రెండింటిలో ఏదికావాలో ఎంపిక చేసుకోవాల‌ని టీడీపీకి సూచించారు.

గ‌తంలో ప్రభుత్వం తనకు రక్షణ కల్పించిందని.. ప్రస్తుతం దాడులు జరుగుతాయని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప‌వ‌న్ చింత‌ల‌పూడి స‌భ‌లో ఆరోపించారు. రెండు రోజుల క్రితం తాను బ‌స‌చేసిన క‌ల్యాణ మండ‌పం వ‌ద్ద ఒక్క‌ పోలీసు కూడా లేర‌ని తెలిపారు. అక్క‌డ గొడ‌వ చేసిన యువ‌కుల‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్థానిక ఎస్సై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాక‌రించారని వెల్ల‌డించారు. పైఅధికారుల చెప్తే గానీ ఆయ‌న ఫిర్యాదు స్వీక‌రించ‌లేద‌ని సూచించారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడే తాను ప్రాణాల‌పై ఆశ వ‌దులుకున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డ‌మెలాగో త‌న‌కు తెలుసున‌ని.. త‌న‌కు సెక్యూరిటీ అవ‌స‌రం లేద‌ని తెలిపారు. గ‌తంలో ప్రభుత్వం తనకు నలుగురు భద్రతా సిబ్బందిని కేటాయించిందని చెప్పారు. అయితే, వారిలో ఒకరు తన సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఎప్ప‌టిక‌ప్పుడు చేరవేస్తుండ‌టాన్ని గుర్తించాన‌న్నారు. అందుకే సెక్యూరిటీని తిర‌స్క‌రించాన‌ని వివ‌రించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఎమ్మెల్యేల రౌడీయిజం మితిమీరుతోంద‌ని విమ‌ర్శించారు.