Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ పోరాటం ఈసారి ఇలా!

By:  Tupaki Desk   |   17 Oct 2022 12:02 PM GMT
జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ పోరాటం ఈసారి ఇలా!
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం పవన్‌ వర్సెస్‌ జగన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విశాఖ టూరు తీవ్ర ఉద్రికత్తలకు కారణమైన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో విశాఖ గర్జన ముగించుకుని వస్తున్న వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు దీన్ని ఆ పార్టీ కుట్రగా పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. కోడి కత్తి తరహాలో వైసీపీ సానుభూతి కోసం డ్రామాలాడుతోందని మండిపడుతున్నారు.

తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పవన్‌ను వైజాగ్‌ వదిలి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వంద మంది జనసేన నేతలను అరెస్టు చేశారు. వారిలో తొమ్మిది మందికి మినహా మిగతా వారందరికీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 9 మందికి ఈ నెల 28 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. మరోవైపు పవన్‌ మద్దతుగా విశాఖపట్నం చేరుకున్న జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా పవన్‌కు మద్దతు లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ చర్యలు అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ఒక పార్టీ అధినేత కూర్చోవాలో, నుంచోవాలో పోలీసులు ఎలా నిర్ణయిస్తారని మండిపడ్డారు. హోటల్‌లో సోదాలు నిర్వహించడం, జనసేన నేతలను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు దుర్మార్గమన్నారు.

అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు తీసుకున్న నేతలను అరెస్టు చేయడం, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టడం దారుణమన్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరారు. అక్టోబర్‌ 17న సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడననున్నారు.

కాగా అక్రమ అరెస్టులు చేయడం, జనసేన పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. తనను కారులో ర్యాలీగా వెళ్లనీయకుండా చేయడం, ప్రజలకు అభివాదం చేయొద్దని చెప్పడం, అక్టోబర్‌ నెలాఖరు వరకు విశాఖలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ప్రకటించడంపై పవన్‌ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వ కాలను ఆయన న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్‌ ప్రభుత్వాన్ని నియంత్రించేలే న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.

కాగా రానున్న రోజుల్లో బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని జనసేనాని పవన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తామన్నారు. ప్రజా సమస్యలపై బలంగా గొంతు వినిపిద్దాం పిలుపునిచ్చారు.

ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు.అరెస్టు అయిన జనసేన పార్టీ నాయకులకు లీగల్‌ టీం అండగా ఉంటుందన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.