Begin typing your search above and press return to search.

పవన నామస్మరణ.. బాబు వీడడం లేదే..

By:  Tupaki Desk   |   3 Feb 2019 6:46 AM GMT
పవన నామస్మరణ.. బాబు వీడడం లేదే..
X
తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటానన్న కేసీఆర్ ఎలాగోలా రాష్ట్రం సాధించేశారు. ఇప్పుడు అధికారం కోసం బాబు గారు కూడా ఏం చేయడానికైనా రెడీ అయ్యారు. అందుకే ఎంత తిడుతున్నా సరే.. పవన్ నామస్మరణతో బాబుగారు జనసేనానిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

బాబుకు, పవన్ కు చెడాక ఇద్దరూ పరస్పరం కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నెలరోజుల నుంచి పవన్ ను తిట్టడం బాబు గారు ఆపేశారు. తిట్టిన టీడీపీ నేతలకు కూడా చీవాట్లు పెడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను నయానో, భయాన్నో లొంగదీసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. జనసేనాని మాత్రం టీడీపీ పొత్తు ప్రస్తావన తెచ్చిన టీడీపీ నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబును పల్లెత్తు మాట అనడం లేదు. దీన్ని బట్టి తెరవెనుక ఏదో జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది.

టీడీపీతో జనసేన పొత్తు వార్తలపై పవన్ సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు అవినీతిని తిడుతున్నాడు. అసహ్యించుకుంటున్నారు. అయినా కూడా కొద్దిరోజులుగా చంద్రబాబు మాత్రం పవన్ పై పల్లెత్తు మాట అనడం లేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రసంగాల్లో అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, కేసీఆర్.. ఢిల్లీలో మోడీని మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ ముగ్గురూ ఒకటే అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇక అదే సమయంలో పవన్ పై చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారు. ఇటీవల అఖిలపక్షం సమావేశంలో పవన్ ఏపీకి కేంద్రం 80వేల కోట్లు ఇవ్వాలని చెప్పుకున్నారు. ఈ మాటలను బాబు అన్వయించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి చూపిస్తున్నాడని.. జగన్మోహన్ రెడ్డి చూపించడం లేదని అంటగట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.

లోపాయికారి ఒప్పందమో లేక.. తెరచాటు అవగాహనో తెలియదు కానీ జగన్ కు మెజారిటీ వచ్చే స్థానాలపైనే టీడీపీ గురిపెట్టినట్టు కనిపిస్తోంది. బాబు దీనికి జనసేనను పావుగా వాడుకుంటున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అందుకే పవన్ ను విమర్శించకుండా పోటీలో నిలిపి జగన్ ను దెబ్బకొట్టే వ్యూహంలో ఉన్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి ప్రజావ్యతిరేకతను పవన్ తో మేనేజ్ చేద్దామనుకుంటున్న బాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందో జనాలు ఏం తీర్పునిస్తారన్నది వేచి చూడాలి మరి.