Begin typing your search above and press return to search.

బాబు గారి జిల్లాపై ప‌వ‌న్ మార్క్ ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   15 March 2020 4:56 PM GMT
బాబు గారి జిల్లాపై ప‌వ‌న్ మార్క్ ఆవేద‌న‌
X
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6 వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యంపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ - దాడులు - బెదిరింపులతో అప్రజాస్వామికంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి, ఎన్నికల ప్రక్రియను తాజాగా చేపట్టాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియ భయానక వాతావరణంలో దౌర్జన్యపూరితంగా - ఏకపక్షంగా జరిగాయని జనసేన పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు. భౌతిక దాడులు - ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులతో బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని తెలిపారు. హింసాత్మకంగా జరిగిన నామినేషన్ ప్రక్రియను సైతం రద్దు చేసి తిరిగి చేపట్టాలని కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లాపై ప‌వ‌న్ మ‌మ‌కారం చూపించారు.

ప్రభుత్వం ఎంత దిగజారి వ్యవహరించినా ప్రజాస్వామ్యం గొంతు నొక్కలేరని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ``స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. అందులో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ. కానీ వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుపై భయపడుతోంది. ప్రతిపక్షాల అభ్యర్ధులను బెదిరించి - దాడులు చేసి గెలవాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా ప్రవర్తించడం బాధాకరం. ` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం నాటి సంద‌ర్భాన్ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. “వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో హింస ఎక్కువైపోతుందని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్పాను. ఈనాడు ఆంధప్రదేశ్ లో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా హింసాత్మక సంఘటనలు - పాలెగాళ్ల రాజ్యమే కనిపిస్తుంది. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా రౌడీయిజం పెరిగిపోయింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. `` అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ``అని ప‌వ‌న్ మండిప‌డ్డారు.

పాల‌న విభాగంలో తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన అధికారులు... తమ కళ్లెదుటే ఇన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే చేతులు కట్టుకొని చూశారని జ‌న‌సేనాని ఆరోపించారు. ``ప్రభుత్వంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. శ‌నివారం మూడు గంటలతో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే... రాత్రి పది గంటల వరకు పోలీసుల సాయంతో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధులను బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఏదైనా ప్రాంతంలో అభ్యర్ధిపై దాడులు జరిగితే అక్కడ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి. జనసేన అభ్యర్ధులు, వారితోపాటు నామినేషన్ వేయడానికి వెళ్లిన నాయకులపై దాడులు జరిగితే అసలు ఏమీ జరగనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. `` అంటూ ఆక్షేపించారు.