Begin typing your search above and press return to search.

అర్ధ‌రాత్రి పిలిస్తే ప‌రుగెత్తుకుంటూ రావాలా?.. ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   27 March 2018 5:15 AM GMT
అర్ధ‌రాత్రి పిలిస్తే ప‌రుగెత్తుకుంటూ రావాలా?.. ప‌వ‌న్‌
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజా ముంద‌డుగుపై జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో అఖిల‌ప‌క్ష స‌మావేశానికి బాబు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అఖిల‌ప‌క్షం వంచించే చ‌ర్య‌..టీడీపీ పాపం మాకు పంచుతారా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాదు తాము ఈ భేటీకి దూరంగా ఉంటామ‌ని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా దక్కక ఆగ్రహంతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ లోని అయిదు కోట్లమందిని మరోసారి మభ్యపుచ్చడానికే ఈ సమావేశం అని జనసేన పార్టీ గట్టిగా విశ్వసిస్తోందన్నారు.

బాబు తీరును ప‌వ‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ నిశితంగా విమ‌ర్శించారు. `ఏదైనా పనికి సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందంటారు మన పెద్దలు. అటువంటి సంకల్పమే సీఎం చంద్ర‌బాబు తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి లోపించింది. సోమవారం సంధ్య ముగిసేవేళ అనుకుని, నిశి రాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రా..రమ్మని ఆయన అనుచరులతో కబురు పంపారు` అంటూ ప‌వ‌న్ ఎత్తిపొడిచారు. `తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి - చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు. ఈ సమావేశం నిర్వహణ కేవలం ' తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ ' గా జనసేన భావిస్తోంది. అందుకే దూరంగా ఉంటోంది. ప్రజలను వంచించే ఎటువంటి చర్యనైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించుకుంది.` అంటూ తేల్చిచెప్పారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాన్చివేత దోర‌ణి అవ‌లంభించార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. `ప్రత్యేక హోదాపై బీజేపీ సర్కారు నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని తెలిసిన తొలినాళ్లలోనే ..అంటే కనీసం మూడేళ్ళ కిందట ఏర్పాటు చేయవలసిన అఖిలపక్ష సమావేశం, అంతా అయిపోయాక కాలం తీరిన మందు వేసినట్లు ఇప్పుడు ఏర్పాటు చేస్తే ఎటువంటి ఫలితం ఉండదని తెలుగుదేశానికి తెలుసు. ప్రజల ఆగ్రహం అర్ధమయ్యాక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మీ పాపాన్ని మాకు పంచడానికేగా ఈ సమావేశం?` అంటూ ప్ర‌శ్నించారు. `ఇటువంటి కంటి తుడుపు సమావేశాలు జనసేనకు ఆమోదయోగ్యం కావు. ప్రజలకు మేలుచేసే చర్యలను చేపట్టినప్పుడు మాత్రమే జనసేన అండ ఉంటుంది. వారు ఏపార్టీ అన్నది జనసేనకు అనవసరం.` అని తేల్చిచెప్పారు.

`ప్రస్తుత తరుణంలో ప్రజాప్రతినిధులే హోదా సాధించే భారాన్ని మోయాలి. ముఖ్యమంత్రిగా. తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు చేయవలసింది ప్రజాప్రతినిధులతో కలసి ఢిల్లీ బాట పట్టడమే. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగండి. తమిళ రైతులు ఢిల్లీ నడి వీధిలో చేసిన ఆందోళన స్ఫూర్తిగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించండి. ఇదంతా ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు కలసికట్టుగా చేయవలసిన ప్రజా కార్యం. ఎందుకంటే మేము మీకు ఓట్లు వేసి గెలిపించాము గనుక. రాజ్యాంగపరమైన భాద్యత మీపై వుంది కనుక. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగి రాదో చూద్దాం. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.- జైహింద్` అంటూ ప‌వ‌న్ ముగించారు.