Begin typing your search above and press return to search.

పీకే సంచలనం.. తప్పంతా బాబుదేనట

By:  Tupaki Desk   |   31 Dec 2019 2:23 PM GMT
పీకే సంచలనం.. తప్పంతా బాబుదేనట
X
ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన మూడు రాజధానులు, అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు జరుగుతున్న యత్నాలంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు... జనసేనాని మద్దతుగా నిలుస్తారని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీకి... ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నారా చంద్రబాబునాయుడుకు పెద్ద దెబ్బే కొట్టాయని చెప్పక తప్పదు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలపై సోమవారం తన పార్టీ కార్యాలయంలో సుధీర్ఘ సమావేశాన్ని నిర్వహించిన పవన్... మంగళవారం రాజధాని రైతులకు మద్దతుగా నిలిచేందుకు అమరావతి పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పవన్ ను పోలీసులు అడ్డుకోవడం, పోలీసుల అడ్డగింతలను దాటుకుని పవన్ ముందుకెళ్లడం మాట అటుంచితే... రాజధానిపై జరుగుతున్న రచ్చకు కారణాలు ఇవేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగానే మారిపోయాయని చెప్పక తప్పదు. అయినా పవన్ ఏమి వ్యాఖ్యానించారన్న విషయానికి వస్తే... ‘‘అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా టీడీపీ అమరావతి కోసం గట్టిగా నిలబడాలి. ఇంకా రెండు కళ్ల సిద్ధాంతం అంటే కుదరదు. రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం చేశారో ప్రపంచానికి చెప్పకపోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పు’’ అని పవన్ సంచలన వ్యాఖ్యలే చేశారు.

అంటే... రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోందని వైసీపీపై పోరాటానికి వచ్చిన పవన్... తనకు తెలిసో, తెలియకో... అమరావతి కోసం పోరాటం చేస్తున్న టీడీపీని, ప్రత్యేకించి చంద్రబాబును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అమరావతిపై బాబు నిజాలు చెప్పి ఉంటే... ఇప్పుడు జగన్ అమరావతి నుంచి రాజధానిని తరలించే సాహసం చేసే వారు కాదని కూడా పవన్ చెప్పినట్టైంది. మొత్తంగా ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలినా, లేదంటే కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు మాత్రమే పరిమితమైనా... ఆ పాపం చంద్రబాబుదే తప్ప జగన్ ది కాదని పవన్ చెప్పేశారన్న మాట.