Begin typing your search above and press return to search.

సాయంలో వివ‌క్ష‌..శ‌వాల మీద పేలాలు ఏరుకున్న‌ట్లుగా!

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:08 AM GMT
సాయంలో వివ‌క్ష‌..శ‌వాల మీద పేలాలు ఏరుకున్న‌ట్లుగా!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తిత‌ల్లీ తుపాను బాధితుల‌కు సాయం అందించే విష‌యంలో ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించిందంటూ ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో సాయం అందించే విష‌యంలో అధికార‌ప‌క్షం వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్నారు.

తానీ ఆరోప‌ణ‌లు ఉత్త‌గా చేయ‌టం లేద‌ని.. బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత చేస్తున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తో క‌లిసి మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. శ్రీ‌కాకుళం జిల్లాలోని తుపాను బాధితుల్ని స్వ‌యంగా ప‌రామ‌ర్శించి.. వారి క‌ష్టాల్ని తెలుసుకున్న త‌ర్వాతే ప్ర‌భుత్వం మీద తాను విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌భుత్వ తీరు శ‌వాల మీద పేలాలు ఏరుకున్న‌ట్లుగా ఉంద‌న్నారు. ఇంత‌టి విషాదంలోనూ ముఖ్య‌మంత్రి ప్ర‌చారం కోసం పాకులాడ‌టం దారుణంగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. వ్య‌క్తిగ‌త కోప‌తాపాల్ని వ‌దిలేసి.. రాష్ట్రాన్ని ఆదుకోవాల‌న్న సూచ‌న చేశారు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మంత్రులు సైతం జిల్లాను ప‌ట్టించుకోలేద‌ని.. ఐఎండీ ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసినా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నారు.

ప్ర‌భుత్వంతోపాటు.. గ‌వ‌ర్న‌ర్ తీరును ప‌వ‌న్ త‌ప్పు ప‌ట్టారు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన తిత‌లీ విధ్వంసంపై గ‌వ‌ర్న‌ర్ స్పంద‌న ఏ మాత్రం బాగోలేద‌న్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఓవైపు సిక్కోలు ప్ర‌జానీకం తుపాను క‌ష్టంలో ఉంటే.. అందుకు భిన్నంగా ముఖ్య‌మంత్రి విజ‌యోత్స‌వాలకు సిద్ధం కావ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్నారు.