Begin typing your search above and press return to search.

పీకేకు ముందున్న‌ది!... మొస‌ళ్ల పండ‌గే!

By:  Tupaki Desk   |   9 Jan 2019 9:24 AM GMT
పీకేకు ముందున్న‌ది!... మొస‌ళ్ల పండ‌గే!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఈ సంక్రాంతి నిజంగానే విష‌మ ప‌రిస్థితినే తీసుకురానుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టిదాకా పార్టీలో ఎలాంటి అసంతృప్తికి ఆస్కారం ఇవ్వ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గానే మెయింటైన్ చేసుకుంటూ వ‌చ్చిన ప‌వ‌న్‌... ఈ పండ‌గ త‌ర్వాత మాత్రం చాలా క‌ఠిన‌త‌ర‌మైన ప‌రీక్ష‌ల‌నే ఎదుర్కోనున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐదేళ్ల నాడు అనూహ్యంగా జ‌న‌సేన పేరిట పార్టీని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... 2014 ఎన్నికల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి దూరంగా ఉండి ఎలాగోలా నెట్టుకొచ్చేశారు. కానీ ఈ ద‌ఫా మాత్రం ప్ర‌త్య‌క్ష పోటీకి సై అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే త‌న‌కు ఎదురు కానున్న గ‌డ్డు ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని... ఈ సారి కూడా ప్ర‌త్య‌క్ష పోటీకి దూరంగా ఉందామ‌నునుకున్నా కూడా అది దాదాపుగా అసాధ్య‌మ‌నే ప‌రిస్థితే. ఎందుకంటే... ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

అయినా ఇప్ప‌టిదాకా పార్టీలో ప‌వ‌న్‌ కు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఏమీ లేదు క‌దా. ఉన్న‌ట్టుండి ఇప్పుడు ఆయ‌న‌కు అంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదురుకానున్న ప‌రిస్థితులేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్నిక‌ల‌కు గ‌డువు త‌రుముకుని వ‌స్తున్న వేళ‌... ఈ నెలాఖ‌రుకో, వ‌చ్చే నెలలోనే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థ‌ల‌ను ప‌వ‌న్ త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌క‌టించాల్సిందే. అయితే ఇప్ప‌టిదాకా ఆయా నియోజ‌కవ‌ర్గాల‌తో పాటు జిల్లాల పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించ‌కుండానే... తానే హోల్ అండ్ సోల్‌ గా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్‌... ఇప్పుడు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఎక్క‌డిక‌క్క‌డ బాధ్య‌త‌ల‌ను ఇత‌రుల‌కు అప్ప‌గించ‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల్లో పోటీ అంటే అది త‌ప్ప‌దు క‌దా. మ‌రి కొత్త పార్టీ అయినా కూడా జ‌న‌సేన టికెట్ల‌ను ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది.

పార్టీ పెట్ట‌క‌ముందే... ప‌వ‌న్ వెన్నంటి న‌డిచిన అభిమాన గ‌ణం ఓ వైపు, పార్టీ పెట్ట‌గానే సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అంటూ చేరిన మేధావి వ‌ర్గం, ఎన్నిక‌ల్లో కొత్త ర‌క్తాన్నే తీసుకువ‌స్తాన‌న్న ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో పార్టీలో చేరిన ఎన్నారైలు, స‌మాజంలో త‌మ త‌మ రంగాల్లో ఓ మోస్త‌రు ప్ర‌తిష్ఠను సంపాదించుకుని రాజ‌కీయాల్లో త‌మ భ‌విష్య‌త్తును ప‌రీక్షించుకుందామ‌ని రంగంలోకి దిగిన‌వారు, నిన్న‌టిదాకా ఇత‌ర పార్టీల్లో చోటా మోటా నేత‌లుగా కొన‌సాగి... త‌మ‌కూ ఓ ఫ్లాట్‌ ఫాం దొరికేసింద‌ని జ‌న‌సేన‌లో చేరిన నేత‌లు, పార్టీలో ఇటీవ‌లే చేరిన మ‌రికొంద‌రు సీనియ‌ర్లు, జూనియ‌ర్లు... ఇలా టికెట్ల‌ను ఆశిస్తున్న వారి జాబితా జ‌న‌సేన‌లోనూ చాంతాడంత ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి రాష్ట్రంలో ఉన్న‌వి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మాత్ర‌మే క‌దా. ఈ సంఖ్య‌కు దాదాపుగా మూడు, నాలుగు రెట్ల సంఖ్యలో ఆశావ‌హులున్నారు. అయితే ఏ పార్టీ అయినా పార్టీలోని అంద‌రికీ సీట్ల‌ను కేటాయించ‌లేద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించినా... జిల్లాల్లో పార్టీ బాధ్యులు, జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీల్లో అయినా ఆయా నేత‌ల‌కు స్థానం ద‌క్కాల్సిందే క‌దా.

అయితే కొత్త పార్టీ అయిన జ‌న‌సేన‌లో చేరిన వారంతా కూడా ఈ కమిటీల్లో ప‌ద‌వులు తీసుకుని గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేందుకు సిద్ధంగా లేరు. అంతేకాకుండా కొత్త పార్టీలో తొలి అవకాశం ద‌క్కించుకుంటే... పార్టీ ఏ మేర ఎదిగితే... తాము కూడా ఆ మేర ఎదుగుతామ‌ని భావన ఆ పార్టీ నేత‌ల్లో అంద‌రిలోనూ ఉంద‌నే చెప్పాలి. ఈ భావ‌న స‌ర్వ‌సాధార‌ణం కూడానూ. ఈ లెక్క‌న సంక్రాంతి త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌న్న క‌మిటీల సందర్భంగా పార్టీలో అసంతృప్తి రేకెత్త‌నుంద‌న్నది విశ్లేష‌కుల మాట‌గా వినిపిస్తోంది. ఈ అసంతృప్తి ఆయా అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల అభ్య‌ర్థుల ప్ర‌ట‌క‌న‌కు వ‌చ్చేస‌రికి తారాస్థాయికి చేరుతుంద‌న్న వాద‌న లేక‌పోలేదు. మ‌రి ఈ అసంతృప్తి జ్వాల‌ల‌ను ప‌వ‌న్ ఏ మేర చ‌ల్లార్చ‌గ‌ల‌ర‌న్న‌ది ఇప్సుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిలిగింది. మొత్తంగా ఈ సంక్రాంతి ప‌వ‌న్‌ కు కాళ‌రాత్రిగానే మారనుంద‌న్న మాట‌లు కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. అంటే... ప‌వ‌న్ కు ముందున్న‌ది మొస‌ళ్ల పండ‌గేన‌న్న మాట‌. చూద్దాం... ఈ క్రొక‌డైల్ ఫెస్టివ‌ల్ ను ప‌వ‌న్ ఎలా ఈదేస్తారో?