Begin typing your search above and press return to search.

అమరావతి పై పీకే స్టాండ్..రాజధానిగా ఉండాల్సిందేనట!

By:  Tupaki Desk   |   30 Dec 2019 5:33 PM GMT
అమరావతి పై పీకే స్టాండ్..రాజధానిగా ఉండాల్సిందేనట!
X
ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన దాదాపుగా అన్ని పార్టీల్లో ప్రకంపనలు రేగగా... జనసేన మాత్రం ఆచితూచి అడుగులేస్తోందనే చెప్పాలి. రాజధానిని అమరావతి నుంచి తరలించరాదని రాజధాని రైతులు సాగిస్తున్న ఆందోళనలకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన జనసేన.. ఆ మేరకు రైతుల దీక్షల్లో పార్టీ సీనియర్లు నాదెండ్ల మనోహన్, నాగేంద్రబాబు పాలుపంచుకున్నారు. అయితే పవన్ మాత్రం ఇప్పటిదాకా రాజధాని ప్రాంతంలో కాలు పెట్టలేదు. అంతేకాకుండా మూడు రాజధానులపై మొన్నటి కేబినెట్ లో స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న భావనతో... ప్రభుత్వ నిర్ణయం వచ్చాక తాను స్పందిస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పవన్ కు షాకిస్తూ మొన్నటి కేబినెట్ లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా కలిపి అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాజధానిపై నోరు విప్పే క్రమంలో సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని స్వయంగా పవనే మీడియా ముందుకు వచ్చి వివరించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. మూడు రాజధానుల మాటపై అంతగా స్పందించని పవన్... ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే ఎలాగంటూ పవన్ ప్రశ్నించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అమరావతిపై తన వైఖరిని వెల్లడించే క్రమంలో పవన్ తనదైన మార్కు వ్యాఖ్యలు చేశారు.

ఈ దిశగా పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే... ‘‘పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల మధ్య చిచ్చురేగుతోంది. ప్రాంతీయ విద్వేషాలతో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర విడిపోయాయి. ఈ జబ్బు ఇంకా ఏపీని వదలలేదు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ వ్యవహారంలా ఉండకూడదు. రాజధాని అమరావతిలో వద్దని వైఎస్ జగన్ అప్పుడూ చెప్పలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా? అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది కనుకే రైతులు భూములు ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తానని స్పష్టంగా అప్పుడే చెప్పా. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని గతంలో జగన్ చెప్పారు. అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయలు తెలుసుకున్నాం. రైతుల కన్నీటితో రాజధాని వద్దని ఆనాడు ప్రభుత్వానికి చెప్పా. అంచెలంచెలుగా రాజధాని నగరం నిర్మించుకోవచ్చు’’ అని పవన్ వ్యాఖ్యానించారు. అంటే... గతంలో రైతుల కన్నీళ్లతో వచ్చే అమరావతి రాజధానిని వద్దని నాడు చెప్పానన్న పవన్.. ఇప్పుడు మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.